రాజకీయాలలో నా గురువు చంద్రబాబు నాయుడు : సినీనటుడు సుమన్ - Actor Suman press meet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 7:37 PM IST
Actor Suman Visits Tirupati Gangamma Temple : రాజకీయాలలో చంద్రబాబు నాయుడు తనకు గురువని సినీనటుడు సుమన్ అన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తరువాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం సుమన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ - జనసేన గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యానికి ప్రజలు ప్రలోభపడకూడదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిబద్ధతతో కూడిన నాయకుడు అవసరమని వివరించారు.
అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఒక్కసారి చేసిన తప్పుకు అయిదు సంవత్సరాలు బాధ పడాల్సి వస్తుందన్నారు. ప్రజలు మ్యానిఫెస్టోలను చూసి మోసపోకుండా గతంలో వారు చేసిన సేవలను, వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయాలని సూచించారు. ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదన్నారు. తమిళనటుడు విజయ్ పార్టీ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అయోధ్య రామప్రతిష్ఠ కార్యక్రమం చరిత్రాత్మకమని, శ్రీరాముని దర్శన భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.