కప్పట్రాళ్ల అడవుల్లో 'యురేనియం' అలజడి - కొండపై ఆలయం పక్కనే తవ్వకాలు!
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
Protest Against Uranium Mining In Kurnool District : కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 20 గ్రామాల ప్రజలు నేడు పార్టీలకతీతంగా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. దీని కోసం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల తవ్వకాలు చేస్తారన్న సమాచారంతో గత కొన్ని రోజులుగా గ్రామస్థులకు కంటిమీద కునుకులేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితమే అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ 68 బోర్ల తవ్వకాలకు ప్రతిపాదనలు పంపగా కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం గ్రామస్థుల్లో మరింత అలజడి రేపుతోంది. ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయి. కౌలుట్లయ్య మలగా పిలిచే ఈ రిజర్వు ఫారెస్ట్ కప్పట్రాళ్ల, పి.కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమిల, గుండ్లకొండ గ్రామాల మధ్య విస్తరించింది. ఆ కొండపైనే కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశంలోనే సర్వే కోసం అనుమతులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.