Whatsapp Usernames Feature : వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలాగే వాట్సాప్‌లోనూ ప్రత్యేకమైన యూజర్ నేమ్‌ను మనం క్రియేట్ చేసుకునే వీలును కల్పించడమే రాబోయే నూతన ఫీచర్ ప్రత్యేకత.
ఇప్పటివరకు వాట్సాప్‌లో కేవలం ఫోన్ నంబరు నుంచే మనం చాట్ చేసే వాళ్లం. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక మనం వాట్సాప్ యూజర్ నేమ్ నుంచి కూడా చాటింగ్ చేయొచ్చు. ఫోన్ నంబరు తెలియాల్సిన అవసరం లేని వారితో చాటింగ్ కోసం యూజర్ నేమ్‌ను వాడొచ్చు. మనం యూజర్ నేమ్‌ను క్రియేట్ చేశాక అది వాట్సాప్ డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. కచ్చితమైన యూజర్ నేమ్ తెలిసిన వారు వాట్సాప్‌లో దాన్ని టైప్ చేసి మనతో చాటింగ్ కోసం కనెక్ట్ అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాట్సాప్‌లో ఒకరినొకరు కనెక్ట్ కావడానికి మరో ప్రత్యామ్నాయం కూడా రెడీ అవుతోంది.
ఇంకా టెస్టింగ్ దశలోనే!
ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందని తెలుస్తోంది. తొలి విడతగా ఈ ఫీచర్‌ను వాట్సాప్ వెబ్‌లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫీచర్‌కు అనుగుణంగా వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లలో మార్పులు చేసి, దాన్ని మరింత మెరుగ్గా చేసే దిశగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఉక్రెయిన్ సంతతికి చెందిన అమెరికన్ స్టానీస్లావ్ విష్నెవ్‌స్కీ స్థాపించిన డిస్కార్డ్(Discord) ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఉంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ)తో నడిచే సోషల్ మీడియా యాప్ ఇది.
ఏఐ స్టూడియో ఫీచర్ విడుదల
వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. దాని పేరే ఏఐ స్టూడియో. గతవారమే ఆండ్రాయిడ్‌లోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు వాట్సాప్‌లోని టెస్ట్‌ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా ఐఓఎస్ వినియోగదారులకు కూడా దాన్ని విడుదల చేసింది. రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫీచర్‌ను మరింత మంది బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఏఐ స్టూడియో ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్ల అవసరాలను తీర్చగలిగే పర్సనలైజ్డ్ చాట్ బోట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి మనకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించి సహకరిస్తాయి.
వాట్సాప్ నయా ఫీచర్స్ - ఇకపై 'ఫేవరెట్స్'తో ఈజీగా కాల్స్ & చాట్స్! - WhatsApp Favourite Feature