Ratan Tata Nano Car Project: ఇప్పటితరానికి నానో కారు గురించి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ రెండు దశాబ్దాల క్రితం అదో పెద్ద సంచలనం. టాటా గ్రూపు నుంచి కేవలం లక్ష రూపాయలకే కారు అనగానే అప్పటివరకు కారు కొనాలన్న ఊహే లేనివారి మదిలో సైతం ఆలోచన రేకెత్తించిన కారు ఇది. మధ్యతరగతి కోసం లక్ష రూపాయలకే కారు తీసుకొస్తామన్న రతన్ టాటా నుంచి ప్రకటన వచ్చింది మొదలు ఎన్నో సందేహాలు, మరెన్నో వివాదాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ రోడ్ల పైకి అడుగుపెట్టిందీ కారు. ఇచ్చినమాట కోసం నష్టాలకు సైతం సిద్ధమయ్యారు రతన్ టాటా!!
మధ్యతరగతి కోసం కారు: దేశంలో కార్లు అంటే సంపన్న వర్గాలకే అనుకునే రోజులవి. మధ్యతరగతి కుటుంబాలకు ద్విచక్ర వాహనాలే దిక్కు. భర్త స్కూటర్ నడుపుతుంటే భార్య, పిల్లలు వెనక సీట్లో కూర్చునేవారు. ఓ రోజు ఆయన కారులో వెళ్తుండగా వర్షంలో ఓ స్కూటర్ మీద దంపతులు తమ పిల్లలతో ఇబ్బంది పడుతూ వెళ్తున్న సంఘటన చూశారట. ఆ ప్రయాణంలో తల్లిదండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లల్ని చూసి చలించిన రతన్ టాటా మధ్యతరగతి వారి కోసం ఓ చౌకైన కారును తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లకే తన మనసులో మాటను బయటపెట్టారు. అంతేకాదు దాన్ని కేవలం లక్ష రూపాయలకే అందిస్తామని ప్రకటించారు. అలా నానో కారుకు బీజం పడింది.
సందేహాలు.. వివాదాలు: టాటా గ్రూపు నుంచి నానో కారుపై ప్రకటన వెలువడింది మొదలు సందేహాలు, వివాదాలు అన్నీఇన్నీ కావు. 'అదంతా అయ్యే పని కాదు' అంటూ చాలామంది పెదవి విరిచారు. మొదట్లో ఈ కారును బంగాల్‌లో తయారు చేయాలనుకున్నారు. అయితే అప్పట్లో టాటా గ్రూపునకు, అక్కడి వామపక్ష గవర్నమెంట్ జరిపిన భూ కేటాయింపులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఉద్యమం నడిపారు.
దీంతో ఈ ప్రాజెక్ట్ గుజరాత్‌కు తరలించాల్సి వచ్చింది. ఈ లక్ష రూపాయల కార్లు ఎడాపెడా రోడ్డు మీదకు వస్తే పర్యావరణం దెబ్బతింటుందన్న పర్యావరణవేత్తల ఆందోళనలూ చుట్టుముట్టాయి. కారు పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీకి ఎన్నికల్లో సహకరించేందుకే రతన్ టాటా నానో కారును ఆగమేఘాల మీద తీసుకొచ్చారన్న అపవాదునూ ఎదుర్కొన్నారు.
విడుదలే ఓ సంచలనం: తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, ఆరోపణలు ఎదుర్కొన్నా రతన్ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. మొదట్లో 2008లో దిల్లీలోని ఆటో ఎక్స్‌పోలో నానో కారును ఆవిష్కరించారు. అనంతరం 2009లో మార్కెట్‌లోకి విడుదల చేశారు. 'లక్ష రూపాయల కారు'గా బాగా ప్రాచుర్యం పొందిన ఈ నానో కారు రిలీజ్ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు అప్పట్లో మీడియా చుట్టుముట్టింది.
నానో కారు ప్రకటన వెలువడి ఐదేళ్లు దాటిపోయినా ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలకే కారును తీసుకొచ్చారు రతన్ టాటా. కారు ఉత్పత్తి ఖర్చుల వల్ల ఆ ధరకు రాదని తెలిసినా నష్టాలను భరించి మరీ ఇచ్చిన మాట కోసం నానో కారును ఆయన ప్రజలకు చేర్చారు. ఓ విధంగా నానో కారు వల్ల కలుగుతున్న నష్టం కూడా టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీ మధ్య వివాదానికి కారణమన్న వాదనలూ ఉన్నాయి.
ముగిసిన ప్రయాణం: మధ్యతరగతి కారుగా ప్రాచుర్యం పొందిన ఈ నానో కారును టాటా గ్రూపు మొత్తంగా 2.75 లక్షల యూనిట్లను విక్రయించింది. అయితే ప్రపంచంలోనే చౌకైన కారుగా వచ్చిన నానో.. వాస్తవంలో మధ్యతరగతికి చేరువవ్వడంలో విఫలమైంది. దీనికి 'చీపెస్ట్ కారు' అని ముద్ర పడడం కూడా అందుకు కారణమని రతన్ టాటానే ఓ సందర్భంలో అంగీకరించారు. రానురాను నానో సేల్స్ పడిపోయాయి. అలా 2019లో నానో ప్రస్థానం ముగిసింది. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ 'నానో' ఓ విధంగా విఫలమైనప్పటికీ ఇచ్చిన మాటను నిలుపుకొన్న వ్యక్తిగా ఆయన అందరి మన్ననలూ గెలుచుకున్నారు. ఇదిలా ఉండగా తనకు మాత్రం వ్యక్తిగతంగా టాటా ఇండికా అంటే ప్రాణమంటూ ఓ సందర్భంలో రతన్ టాటా చెప్పుకొచ్చారు.
డిజిటల్ పేమెంట్స్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం- యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితుల పెంపు
ఒప్పో దీపావళి సేల్‌లో ₹10లక్షలు గెలుచుకొనే ఛాన్స్- ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా..!