Why Does Smartphone Have A Small Hole? : నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ఫోన్లు యూజ్ చేస్తున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి అందులో ఉన్న అన్ని రకాల ఫీచర్ల గురించి తెలిసి ఉండకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే వాడితే.. మరికొందరు మొబైల్‌తోనే పనులన్నీ చక్కబెట్టేస్తుంటారు.
అలాకాకుండా.. ఎప్పుడైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో(Smartphone) వెనుక వైపు కెమెరాల మధ్యలో, ఫ్లాష్ లైట్ పక్కన, ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా ఫోన్ పై వైపు ఫ్రేమ్‌లో, కింద ఛార్జింగ్ పోర్ట్ పక్కన "చిన్నపాటి రంధ్రం" ఉండటం గమనించారా? ఆ రంధ్రం ఎందుకు ఉంటుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? లేదా? అయితే, అసలు.. ఇంతకీ ఆ రంధ్రం ఎందుకు? దాంతో యూజర్‌కు ఉపయోగం ఏంటి? దాని గురించి టెక్ నిపుణులు ఏం చెబుతున్నారు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మార్కెట్లోకి స్మార్ట్ఫోన్లు విడుదలైన కొత్తలో చాలా మంది ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో ఒక రకమైన శబ్దం వినిపిస్తుందని.. దాని కారణంగా అవతలి వారు మాట్లాడే మాట స్పష్టంగా వినిపించడం లేదని చెప్పేవారట. అదే.. నాయిస్ డిస్ట్రబెన్స్. తర్వాతి కాలంలో ఆ సమస్య రాకుండా స్మార్టఫోన్స్లో సరికొత్త ఫీచర్‌ని రూపొందించాయి మొబైల్ కంపెనీలు. అలా నాయిస్ డిస్ట్రబెన్స్ రాకుండా ఉండడానికి స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఆ ఫీచరే.. ఈ చిన్న రంధ్రం. అవును.. ఆ రంధ్రంలో మినీ మైక్రోఫోన్ ఉంటుంది.
మీకు మొబైల్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమా? ఈ టాప్-7 ఫోన్లపై ఓ లుక్కేయండి!
ఆ మినీ మైక్రోఫోన్ 'నాయిస్ క్యాన్సిలేషన్ డివైజ్'గా పనిచేస్తుందని చెబుతున్నారు టెక్ రంగ నిపుణులు. దాని కారణంగానే మనం అవతలి వారికి ఫోన్ చేసినప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా ఒకరి మాటలు మరొకరికి స్పష్టంగా వినిపిస్తాయంటున్నారు. ఒకవేళ పక్కన ఏదైనా శబ్దాలు వినిపించినప్పటకీ దాని తీవ్రత మాత్రం ఎంతో కొంత తగ్గేలా చేసి.. అవతలివారికి మన వాయిస్ స్పష్టంగా వినిపించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలవుతున్న ఇయర్ బడ్స్‌లోనూ ఇలాంటి ఫీచర్లను మొబైల్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయంటున్నారు. అంటే.. ఈ ఫీచర్ వల్ల ఇయర్ బడ్స్‌తో కూడా నాయిస్ డిస్ట్రబెన్స్ లేకుండా యూజర్లు తమ సంభాషణలు కొనసాగించవచ్చన్నమాట.
ఫోన్ అడిక్షన్తో బాధపడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!