What Is Artificial General Intelligence : ఇప్పుడు ఎక్కడా చూసినా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ జరుగుతోంది. మనకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా, వేగంగా ఏఐ ద్వారా తెలుసుకునే వీలుకలుగుతోంది. అయితే మరికొద్ది రోజుల్లో ఇంతకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మార్కెట్లోకి రానుంది. అదే 'ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటిలిజెన్స్ (ఏజీఐ)'.
ఏజీఐ టెక్నాలజీతో రూపొందించిన రోబోలు అచ్చం మానవులలాగానే ఆలోచిస్తాయి. మనలాగే ఏ విషయాన్ని అయినా నేర్చుకుంటాయి. పైగా ఇవి మానవుల ఆలోచనలు, భావోద్వేగాలు, కోపం, ఆనందం అన్నింటిని తెలుసుకోగలుగుతాయి. వాటిని అలవరుచుకోగలుగుతాయి కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవులకు ఉండే విజ్ఞానం మొత్తం ఈ ఏజీఐ రోబోలకు ఉంటుంది.
సొంతంగా ఆలోచిస్తాయ్
ఏజీఐ సాంకేతికతతో తయారు చేసిన రోబోలు మానవుల మాదిరిగానే ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకుంటాయి. అంతేకాదు ఏ విషయాన్ని అయినా స్వయంగా నేర్చుకుంటాయి. అంటే వీటికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. పరిస్థితులను బట్టి తమకు తామే ఇవి మార్పులు, చేర్పులు చేసుకోగలుగుతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పరిస్థితులను బట్టిన మానవుల లాగా తమను తాము మార్చుకోగలుగుతాయి. కొత్త అవకాశాలను అన్వేషించడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లాంటివి చేస్తాయి.
ఇది సాధ్యమేనా?
మానవుల మేధస్సు చాలా సంక్లిష్టమైనది. ఇలాంటి సంక్లిష్టమైన మేధస్సుతో ఒక రోబోను లేదా యంత్రాన్ని సృష్టించడం అంత తేలికైన పనికాదు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్‌తో రోబోలు తయారు చేయాలంటే, న్యూరో సైన్స్, కంప్యూటర్ సైన్స్, కాగ్నిటివ్ సైకాలజీ సహా వివిధ అధునాతన టెక్నాలజీలను ఉపయోగించాల్సి ఉంటుంది.
మానవాళికి ముప్పు తప్పదా?
ఏజీఐ అభివృద్ధిపై అనేక సందేహాలున్నాయి. ఏజీఐ రోబోలు వస్తే, మన ఉద్యోగాలపై, వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఏజీఐ మానవ విలువలను కలిగి ఉంటుందని, సమాజ శ్రేయస్సు, అభివృద్ధికి పాటుపడుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవాళి గోప్యత, భద్రతకు ముప్పు ఉండకూడదంటే, బలమైన భద్రతా ప్రమాణాలతో ఏజీఐను రూపొందించాలని, ఏజీఐపై మానవ పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని సూచిస్తున్నారు.
ఏజీఐ టెక్నాలజీ భవిష్యత్‌లో చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు వచ్చే సాంకేతిక సమస్యలను, అడ్డంకులను అధిగమించడానికి, సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఏజీఐ ఉపయోగపడవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని వల్ల పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు శాస్త్రీయ ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయడంలో ఏజీఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ నయా ఫీచర్ - ఇకపై గ్రూప్‌లోనే 'ఈవెంట్ ప్లాన్' చేయండిలా! - WhatsApp Event Planning
మీ రిమోట్ పోయిందా? స్మార్ట్‌ఫోన్‌తోనే టీవీని ఆపరేట్ చేయండిలా! - Use Smart Phone As A TV Remote