How To Prevent Gadget Addiction In Children : ప్రస్తుత సాంకేతిక యుగంలో పిల్లలకు ఫోన్, టీవీ, పీసీ, ట్యాబ్లెట్ ఇలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఓ వ్యసనంగా మారిపోయాయి. వీడియో గేమ్స్ వంటి వాటికి పిల్లలు బానిసలుగా మారిపోతున్నారు. దీంతో చదువు, ఇతర విషయాలపై వారికి ఆసక్తి తగ్గిపోతోంది. టీనేజర్స్ అయితే సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడిపేస్తుంటారు. తీరా వ్యసనంగా మారిన తర్వాత పిల్లలు ఫోన్ వదిలేలా చేయడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. అందుకే పిల్లలను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు ఎలా దూరం చేయాలన్న విషయంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లల ముందు ఫోన్ ఎక్కువగా వాడకండి
పిల్లలు గాడ్జెట్లకు బానిసవ్వడానికి గల కారణాలను ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే పిల్లల ముందు ఎక్కువగా ఫోన్ వంటివి వాడకూదదు. అప్పుడు వారు మిమ్మల్ని నిశితంగా పరిశీలించి ఫోన్ వాడకం తగ్గిస్తారు. అలాగే మీరు ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో కొంత సమయం గడపాలి. ప్రకృతితో మమేకమయ్యేలా పిల్లలను పార్క్, గ్రౌండ్ వంటి వాటికి తీసుకెళ్లాలి. అప్పుడు వారిలో ఒత్తిడి సైతం తగ్గుతుంది. అలాగే ఫోన్, ట్యాబ్లెట్, టీవీ వంటి గాడ్జెట్స్‌కు బానిసవ్వకుండా ఉంటారు.
మిమ్మల్నే అనుకరిస్తారు జాగ్రత్త
సాధారణంగా పెద్దలు చేసే పనులను పిల్లలు అనుకరిస్తుంటారు. కనుక ముందుగా మీరు ఫోన్‌కు దూరంగా ఉండాలి. పిల్లల ముందు అతిగా ఫోన్ వాడడం, టీవీలు చూడటం మానుకోవాలి. వారితో సరదాగా మాట్లాడండి. డైనింగ్ టేబుల్, బెడ్ రూమ్‌లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను వాడకూడదనే నిబంధనను కుటుంబ సభ్యులకు పెట్టండి.
టైమ్ లిమిట్ పెట్టండి
గాడ్జెట్లను పూర్తిగా దూరంగా ఉంచడం సాధ్యం కాదు. అందువల్ల మరో మార్గాన్ని కనుగొనడం అవసరం. పిల్లలకు గాడ్జెట్లను అందించడానికి లేదా స్మార్ట్ టీవీని చూడడానికి సమయాన్ని నిర్ణయించండి. వాటిని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చూడాలో కచ్చితంగా నిర్దేశించండి. ఆడడం, మాట్లాడటం, కథలు చెప్పడం లాంటివి చేయాలి.
ఇలా చేస్తే ఫర్వాలేదు
పిల్లల జీవితాల్లో సాంకేతికత ముఖ్యమే. అలా అని ఫోన్‌కే బానిసైపోతే ఇబ్బందులు తప్పవు. వారికి చదువుకు అవసరమైన యాప్స్‌ను డౌన్లోడ్ చేసేలా చూడండి. అలాగే గాడ్జెట్ అడెక్షన్ నుంచి వారిని తప్పించేందుకు పుస్తకాలు చదివించడం, సంగీతం నేర్పించడం లాంటి పనులు చేయాలి. వారి స్నేహితులతో ఆడుకునేలా చేయండి.
మీరు ఎంత ప్రయత్నించినా మీ పిల్లలు గ్యాడ్జెట్ వ్యసనం నుంచి బయటపడకపోతే ప్రొఫెషనల్స్ సాయం తీసుకోవడం మంచిది. పిడియాస్టియషన్స్, థెరపిస్ట్, స్కూల్ కౌన్సిలర్స్ వద్దకు పిల్లలను తీసుకెళ్లాలి. గాడ్జెట్ వ్యసనం నుంచి పిల్లలను బయట పడేయడం చాలా ఓర్పు, సహనంతో కూడుకున్న పని అని గుర్తుంచుకోండి.
ట్యాబ్ కొనాలా? ఏ సైజులో తీసుకోవాలో అర్థం కావడం లేదా? అయితే మీకోసమే ఈ ఆర్టికల్! - Tablet size