Swiggy Celebrates 10 Years: ప్రస్తుత కాలంలో నచ్చిన ఫుడ్ నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుండడంతో అంతా స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థల యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్‌లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అయితే స్విగ్గీ యాప్‌లో ఒక్క ఆర్డర్ కూడా రాని రోజు ఉందని, ఆ రోజు ఆర్డర్ కోసం చాలా ఎదురుచూశామని స్విగ్గీ సీఈవో తెలిపారు. స్విగ్గీ ప్రస్థానం స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తమ జర్నీపై ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
'ఆ రోజు ఒక్క ఆర్డరూ రాలేదు': స్విగ్గీని ప్రారంభించిన మొదటి రోజు ఫుడ్ ఆర్డర్ కోసం ఎంతగానో ఎదురుచూడగా ఒక్క ఆర్డర్ కూడా రాలేదని సీఈవో శ్రీహర్ష తెలిపారు. రెండో రోజు ట్రఫుల్స్ రెస్టారంట్ నుంచి రెండు ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొన్నారు. రెండు ఆర్డర్లతో మొదలై ఇప్పుడు ప్రతి ఇంట్లో స్విగ్గీ పేరు వినిపిస్తుందన్నారు.
3లక్షల రెస్టారెంట్లతో భాగస్వామ్యం: మొదట రెండు ఆర్డర్లు వచ్చిన ట్రఫుల్స్ రెస్టారెంట్ తమ భాగస్వాముల్లో ఒకటని శ్రీహర్ష చెప్పారు. ఈ రోజు 3లక్షల రెస్టారెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇది తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. తమ ప్రయాణంలో సహకరించిన కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు శ్రీహర్ష కృతజ్ఞతలు తెలిపారు.
"ఆగస్టు 6, 2014లో మేం స్విగ్గీని ప్రారంభించాం. ఫుడ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాం. కానీ మొదటిరోజు మాకు ఒక్క ఆర్డరు కూడా రాలేదు. మరుసటి రోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. అదే మా జర్నీలో అసలైన ప్రారంభానికి గుర్తు. మా భాగస్వాముల్లో ఒకటైన ట్రఫుల్స్ రెస్టారంట్ నుంచి మాకు రెండు ఫుడ్ ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి నుంచి వారితో మా భాగస్వామ్యం బలపడింది. ఒక దశలో ఒక్క రోజులో 7261 ఆర్డర్లు అందుకున్నాం." - శ్రీహర్ష మాజేటి, స్విగ్గీ సీఈవో
స్విగ్గీ ప్రారంభం:
- బెంగళూరు కేంద్రంగా 2014 ఆగస్టు 6న స్విగ్గీ ప్రారంభించారు.
- శ్రీహర్ష మాజేటి, రాహుల్, నందన్ రెడ్డి భాగస్వామ్యంలో స్విగ్గీ ఏర్పాటైంది.
- దాదాపు 600 భారత నగరాలకు దీని కార్యకలాపాలు విస్తరించాయి.
- నిత్యావసరాలను వేగవంతంగా సరఫరా చేసే సేవల విభాగం ఇన్‌స్టామార్ట్ కూడా స్విగ్గీలో భాగమే.
కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో- ఇకపై ఆ సర్వీసులు రద్దు! - Zomato Legends Service Shuts Down