How To Maximize IPhone Battery Life : మీరు ఐఫోన్ యూజర్లా? మీ మొబైల్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? అయితే ఇది మీ కోసమే. ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు యాపిల్ కంపెనీ 5 కీలకమైన టిప్స్ చెప్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఐఓఎస్ అప్‌డేట్
ఐఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండాలంటే, ఎప్పటికప్పుడు ఐఓఎస్ అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ కంపెనీ స్పష్టం చేసింది. ఈ అప్‌డేట్స్ కొత్త ఫీచర్‌లు అందించడమే కాదు, బ్యాటరీ లైఫ్‌ను, డివైజ్ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని పేర్కొంది. కనుక ఇకపై ఎప్పుడు సాఫ్ట్‌వేర్ అప్డేట్లు వచ్చినా వెంటనే వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది.
కూల్ కూల్‌గా
ఐఫోన్‌లు సాధారణ ఉష్ణోగ్రతల (16- 22°C) వద్దనే మెరుగ్గా పనిచేస్తాయని యాపిల్ కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ మీ ఫోన్‌కు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి తగిలితే, బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాదు మరీ చల్లని వాతావరణంలో కూడా ఐఫోన్‌ను ఉంచకూడదని, ఒకవేళ ఉంచితే ఐఫోన్ బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుందని పేర్కొంది. అందుకే ఐఫోన్‌ను ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉంచాలి. అప్పుడే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.
కేస్ వద్దు!
చాలా మంది తమ ఫోన్ల భద్రత కోసం కేస్‌లు వినియోగిస్తుంటారు. అయితే కేసుతో పాటు ఐఫోన్‌ను ఛార్జింగ్ చేయడం మంచిది కాదని యాపిల్ కంపెనీ తెలిపింది. ఛార్జ్ చేసే సమయంలో ఫోన్ సహజంగానే వేడెక్కుతుంది. కానీ కేసులు ఆ వేడిని బయటకు పోనీయకుండా చేస్తాయి. ఫలితంగా బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకనే ఐఫోన్ ఛార్జ్ చేసే సమయంలో పౌచ్ లేదా కేస్‌లను పూర్తిగా తొలగించాలి.
సగం ఛార్జ్ చేస్తే చాలు
ఐఫోన్‌ను చాలా రోజులు పాటు వాడకూడదని అనుకుంటే, ఫుల్ ఛార్జ్ చేయకూడదు. అలాగే పూర్తిగా ఛార్జింగ్ లేకుండానూ ఉంచకూడదు. అలా కాకుండా ఫుల్ ఛార్జ్ చేసినా లేదా పూర్తిగా ఛార్జ్ చేయకుండా వదిలేసినా, ఫోన్ పనితీరుతో పాటు, బ్యాటరీ లైఫ్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఐఫోన్‌ను కొన్ని రోజులపాటు ఉపయోగించకుండా ఉండాల్సి వస్తే, కేవలం 50 శాతం ఛార్జింగ్‌తో స్టోర్ చేయడం మంచిదని యాపిల్ తెలిపింది. ఒక వేళ మీరు 6 నెలల కంటే ఎక్కువ రోజులు డివైజ్‌ను ఉపయోగించకూడదు అనుకుంటే, ప్రతీ 6 నెలలకు ఒకసారి కచ్చితంగా ఛార్జింగ్ చేయాలని పేర్కొంది. ఈ సూచనలు పాటిస్తే, బ్యాటరీ సామర్థ్యం మెరుగవడంతోపాటు, బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు ఉంటుందని యాపిల్ స్పష్టం చేసింది.
లో పవర్ మోడ్
యాపిల్ కంపెనీ ఐఓఎస్ 9లో లోపవర్ మోడ్‌ను పరిచయం చేసింది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే, ఐఫోన్ బ్యాటరీ లైఫ్ మెరుగవుతుంది. అంతేకాదు డిస్‌ప్లే బ్రైట్‌నెస్, యానిమేషన్, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను రిఫ్రెష్ చేయడాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఐఫోన్‌లో ఛార్జింగ్ తగ్గినప్పుడు ఈ లోపవర్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవాలని యాపిల్ తెలిపింది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ లోపవర్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే దీని వల్ల మెయిల్ ఫెచ్చింగ్, క్లౌడ్ సింక్ లాంటి అనేక కార్యకలాపాలు నిలిచిపోతాయని పేర్కొంది.
రూ.10వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-6 ఆప్షన్స్ ఇవే! - Best Smartphone Under 10000