How To Know If Your Phone Has Been Hacked : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కిరాణా సరకుల నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపు వరకు ప్రతీదీ స్మార్ట్‌ఫోన్‌తోనే అయిపోతోంది. అందుకే స్మార్ట్ఫోన్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫోన్‌ను ఇతర పరికరాల మాదిరిగానే హ్యాక్ చేస్తున్నారు. ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా, ఫొటోలు, కాంటాక్ట్స్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి వాటిని దొంగిలిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదును కొల్లగొడుతున్నారు. అందుకే ఈ స్టోరీలో మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో, లేదో ఎలా తెలుసుకోవాలి? హ్యాకింగ్‌కు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
మాల్వేర్ దాడులు
కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఫోన్లోకి బోగస్ యాప్‌లు డౌన్లోడ్ అయిపోతాయి. ఆ యాప్‌ల ద్వారా రాన్సమ్వేర్, యాడ్వేర్, స్పైవేర్లు మీ ఫోన్లోకి ప్రవేశించేటట్లు చేస్తారు సైబర్ నేరగాళ్లు. కొన్నిసార్లు మీరు కొన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లోనే మాల్వేర్ ఉండొచ్చు. అలాగే ఈ-మెయిల్, టెక్స్ట్స్ మెసేజెస్, ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఫిషింగ్ దాడులు జరగవచ్చు. ఇలా మీ ఫోన్ హ్యాక్ అయితే దాని పెర్ఫార్మెన్స్ బాగా స్లో అయిపోతుంది. అలాగే ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఛార్జింగ్ కూడా వేగంగా అయిపోతుంది. ఎందుకంటే మీ ఫోన్లో ఉన్న మాల్వేర్ మీ ఫోన్ సోర్సెస్ అన్నింటినీ విపరీతంగా వాడేస్తూ ఉంటుంది.
మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని ఎలా తెలుసుకోవచ్చు?
మీ ఫోన్లో సాధారణం కంటే ఎక్కువసార్లు పాప్-ఆప్ యాడ్స్ వచ్చాయంటే యూజర్లు అలర్ట్ అవ్వాలి. ఈ పాప్-అప్స్ ద్వారా హ్యాకర్లు మీ ఫోన్లోకి హానికరమైన వైరస్లు పంపిస్తారు. కనుక మీ పర్సనల్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. మిస్టీరియెస్ యాప్స్, కాల్స్, మేసేజ్‌లు వచ్చినా మీరు జాగ్రత్త పడాలి. మీరు డౌన్లోడ్ చేయని కొత్త యాప్‌లు మీ ఫోన్లో కనిపించినా అది హ్యాక్ అయినట్లే. మీ ఫోన్ కాల్ లాగ్‌లో మీరు చేయని నంబరు ఉన్నట్లైనా హ్యాక్ అయినట్లేనని గుర్తుంచుకోవాలి.
కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఫోన్లోని డేటా అయిపోతుంది. అప్పుడు మీ ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయం గుర్తించాలి. స్పైవేర్ సోకిన ఫోన్ల ద్వారా స్కామర్లు బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుంటారు. మీ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను సేకరిస్తారు. దీని వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
మీ ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి?
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్లైన్ ప్రొటెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేయని యాప్స్ ఏవైనా మీ ఫోన్లో ఉంటే, వాటిని డిలీట్ చేయాలి. ప్రమాదకర టెక్స్ట్‌లను తొలగించాలి. లేదా మీ ఫోన్లోని డేటాను రీస్టోరింగ్ చేయాలి. మీ బ్యాంకు, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ను తనిఖీ చేయాలి. ఏవైనా అనధికార లావాదేవీలు జరిగాయేమో చూడాలి. ఇంకా ఏమేమి చేయాలంటే?
- మీ ఫోన్లోకి కాంప్రిహెన్షివ్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీని వల్ల మీ ఫోన్ సైబర్ దాడులకు గురికాకుండా ఉంటుంది.
- వీలైనంత వరకు ఎయిర్ పోర్టులు, హోటళ్లు, లైబ్రరీల లాంటి ప్రదేశాల్లో పబ్లిక్ వైఫైను వాడవద్దు. ఒక వేళ పబ్లిక్ వైఫై వాడాల్సి వస్తే, కచ్చితంగా వీపీఎన్‌ను వాడండి.
- పాస్వర్డ్ మేనేజర్‌ను వాడడం మంచిది. బ్యాంకు అకౌంట్, ఈ-మెయిల్ వంటి వాటికి స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. వీక్ పాస్వర్డ్ ఉంటే సైబర్ నేరగాళ్లు ఈజీగా దాన్ని హ్యాక్ చేస్తారు.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకండి. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్లో హ్యాకర్లు మీ ఫోన్లోకి మాల్వేర్ను పంపిస్తారు. దీని ద్వారా మీ పాస్‌వర్డ్‌లను, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేస్తారు.
- మీ ఫోన్లో ట్రాకింగ్ సెట్టింగ్స్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి.
- మీ ఫోన్‌కు స్ట్రాంగ్ పాస్వర్డ్, పిన్ పెట్టుకోవాలి.
- గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లాంటి అధికారిక యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోండి.
- అంతేకాదు యాప్స్ సురక్షితమైనవో, కాదో తెలుసుకున్నాకే డౌన్లోడ్ చేసుకోండి.
- డౌన్లోడ్ చేసేటప్పుడు యాప్స్ పర్మిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లొకేషన్, కాంటాక్ట్స్, ఫొటోలు వంటి వాటిని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ పొందడం ద్వారా హ్యాకర్లు మీ ఫోన్లోని డేటాను కొల్లగొట్టే అవకాశం ఉంటుంది.
- మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేయండి. దీని వల్ల మీ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. స్పీడ్‌గా రన్ అవుతుంది.