Pradhan Mantri Kisan Mandhan Yojana: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పథకాలు కొనసాగుతున్నాయి. అయితే వాస్తవానికి ఇవన్నీ రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే ఆర్థిక భరోసాను అందిస్తాయి. మరి రైతులు వృద్ధాప్యంలోకి అడుగుపెడితే? అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేకపోతే? ఇలాంటి సందర్భాల్లో చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచేందుకే కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన' పథకాన్ని అమలు చేస్తోంది. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన 60 ఏళ్లు పైబడిన రైతులకు ప్రతినెలా ఈ పథకం ద్వారా రూ.3,000 చొప్పున పింఛన్ అందిస్తోంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలు మీకోసం.
ఈ పథకానికి ఎవరు అర్హులు?:
- వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- భూ పరిమితి: దరఖాస్తుదారునికి 2 హెక్టార్ల వ్యవసాయ భూమి లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
- ఇతర పథకాల ప్రయోజనం: దరఖాస్తుదారు ఏ ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకానికి లబ్ధిదారుడు కాకూడదు.
అప్లికేషన్ ప్రాసెస్:
- ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం.
- ఈ స్కీమ్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మొదట మీరు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించాలి.
- CSC కేంద్రాలలో ఈ పథకం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు.
- CSC కేంద్రాల గురించిన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం: ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు CSCకి ఈ క్రింది పత్రాలను సమర్పించాలి.
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
- ల్యాండ్ డాక్యుమెంట్స్
- మొబైల్ నంబర్
పథకంలో మీ దరఖాస్తు నమోదు: మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌లోని సమాచారం ఆధారంగా CSC ఆపరేటర్ మీ అప్లికేషన్‌ను మీ తరఫున ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారు. ఇది మీ బ్యాంకింగ్ సమాచారం, ఆధార్ స్కీమ్‌ను లింక్ చేస్తుంది.
ఎంత ప్రీమియం చెల్లించాలి?: ఈ పథకంలో చేరిన రైతు వయసు ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతు చెల్లించిన ప్రీమియం ఎంత ఉంటుందో.. అంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది.
ఉదాహరణకు 18 సంవత్సరాల వయసున్న ఒక రైతు నెలకు రూ.55 చెల్లించాడని అనుకుందాం. అప్పుడు కేంద్రం కూడా ఆ రైతు పేరు మీద రూ.55 బీమా కంపెనీకి చెల్లిస్తుంది. అంటే ఆ రైతు పేరుమీద కడుతున్న ప్రీమియం రూ.110 అవుతుంది. అంటే 40 ఏళ్లు పైబడిన వారికి నెలవారీ ప్రీమియం దాదాపు రూ.200 ఉంటుంది.
పెన్షన్ కార్డ్: పీఎంకేఎంవై పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రైతుకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత CSC సెంటర్లో రైతు పేరున ప్రత్యేక పింఛన్ ఖాతాను తెరచి పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్(పెన్షన్ కార్డ్) కార్డును అందిస్తారు. ఇందులో రైతు అమౌంట్, పెన్షన్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది.
ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్:
- ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.
- అక్కడ ఒక ఆపరేటర్ ఈ పథకానికి ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవటంలో మీకు సహాయం చేస్తారు.
- స్కీమ్ కోసం ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు దరఖాస్తు ఫారమ్ నింపాల్సి ఉంటుంది.
- ఈ ఫారమ్ CSC కేంద్రంలో అందుబాటులో ఉంటుంది.
- అందులో మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ల్యాండ్ వంటి మీ వ్యక్తిగత వివరాలను పూరించాలి.
ఫారమ్ సబ్మిట్ అండ్ పేమెంట్:
- ఫారమ్‌ను సరిగ్గా పూరించిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసి స్కీమ్ ఫీజును కూడా చెల్లించాలి.
- ఆ తర్వాత CSC ఆపరేటర్ ఈ పథకంలో మీ పేరు నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు.
స్కీమ్ బెనిఫిట్స్:
- ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్: ఈ పథకానికి అప్లై చేసుకున్న రైతులు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు.
- ఫ్యామిలీ సెక్యూరిటీ: ఈ స్కీమ్ కోసం నమోదు చేసుకున్న రైతు ఒకవేళ మరణిస్తే అతడి భార్యకు ప్రతి నెలా పెన్షన్ మొత్తంలో సగం అంటే రూ.1500 లభిస్తుంది.
- వాలంటరీ స్కీమ్: ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమైనది. కావున కావాలంటే రైతులు ఎప్పుడైనా దీన్ని ఆపేసుకోవచ్చు.