Digital Car Key Feature : ఒక్కోసారి మన కారు తాళం పోగొట్టుకున్నప్పుడు అప్పటికప్పుడు కొత్త కీ చేయించాలంటే కష్టమైన కూడుకున్న పని. అలాంటి సందర్భాల్లో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ తెచ్చిన 'డిజిటల్ కీ' ఫీచర్. ఇది కేవలం తాళం పోయిన సందర్భాల్లోనే కాకుండా వేరే సమయాల్లోనూ మీకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే, దీన్ని సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ డివైజ్ ఉంటే సరిపోతుంది. ఈ ఫీచర్ సాయంతో ఎంచక్కా మీ కారును ఆపరేట్ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ డిజిటల్ కార్ కీ అంటే ఏంటి?
ఈ డిజిటల్ కీ ఫీచర్ అల్ట్రా-వైడ్ బ్యాండ్ అనే టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఇది మీ దగ్గరున్న ఆండ్రాయిడ్ ఫోన్ సాయంతో కారును లాక్, అన్‌లాక్ చేసే వీలును కల్పిస్తుంది. అంతేకాకుండా మీ కారుకు సంబంధించి మరిన్ని పనులను కూడా ఈ డిజిటల్ కీ ఫీచర్ ద్వారా చక్కబెట్టుకోవచ్చు. అయితే ఈ డిజిటల్ కార్ కీ ఫీచర్‌ను టెక్ దిగ్గజం యాపిల్ తన డివైజుల్లో 2020లోనే ప్రవేశపెట్టింది. గూగుల్ మాత్రం తన అప్డేటెడ్ వెర్షన్లో భాగంగా ఈ డిజిటల్ కార్ కీ ఫీచర్‌ను 2021లో ఆండ్రాయిడ్ 12లో తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఒక్కోసారి మీ కారు తాళాలను ఇంట్లోనో లేదా ఆఫీసులోనో మర్చిపోయినప్పుడు ఈ డిజిటల్ కారు కీ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో డిజిటల్ కారు కీ ఫీచర్‌కు సంబంధించి పలు సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెటప్ సాయంతో మీ కారు డోర్లను లాక్, అన్‌లాక్, స్టార్ కూడా చేయవచ్చు.
ఈ ఆండ్రాయిడ్ డివైజుల్లో డిజిటల్ కీ ఫీచర్
ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ శామ్సంగ్ గెలాక్సీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే అందులోని శామ్సంగ్ వాలెట్ (Samsung Wallet) సాయంతో ఈ డిజిటల్ కీ ఫీచర్‌ను వాడవచ్చు. శామ్సంగ్ కాకుండా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నవారు కూడా గూగుల్ వాలెట్ (Google Wallet) యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని డిజిటల్ కార్ కీ ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు.
- పిక్సల్ 6 వెర్షన్స్
- లేటెస్ట్ పిక్సెల్ 8 ప్రో
- పిక్సెల్ ఫోల్డ్
- శామ్సంగ్ గెలాక్సీ S21+, ఆపై వచ్చిన మోడల్స్‌లో
- ఆండ్రాయిడ్ 12, ఆపై వచ్చిన వెర్షన్స్‌లో డిజిటల్ కీ ఫీచర్ పనిచేస్తుంది.
అన్ని కార్లలో పనిచేస్తుందా?
కొన్ని కంపెనీలు మాత్రమే తమ కార్లలో ఈ డిజిటల్ కీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. సెలెక్టెడ్ ఆటోమొబైల్ మార్కెట్లలోనే వీటిని ప్రవేశపెట్టాయి.
ఆండ్రాయిడ్ డిజిటల్ కార్ కీ ఎలా పని చేస్తుంది?
ఆండ్రాయిడ్ డిజిటల్ కార్ కీ ఫీచర్ ఎన్ఎఫ్సీ లేదా యూడబ్ల్యూబీ (నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్ లేదా అల్ట్రా-వైడ్ బ్యాండ్) సాంకేతికత సాయంతో పనిచేస్తుంది. మీరు NFC అనుకూల Android ఫోన్‌ను కలిగి ఉన్నట్లయితే దానిని లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి మీ ఫోన్‌ను కారు తలుపుల దగ్గర ఉంచండి. ఇంజిన్‌ను ఆన్ చేయడానికి మీరు దానిని కారు కీ రీడర్‌పై ఉంచవచ్చు.
అయితే ఇలా మీ కారు డోర్‌ను లాక్, అన్‌లాక్ చేయడం కోసం ప్రతిసారి మీ జేబులో నుంచి ఫోన్‌ను తీసి కారు కీ రీడర్‌పై ఉంచి ఆపరేట్ చేయడం కాస్త మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయవచ్చు. అలాంటప్పుడే ఈ యూడబ్ల్యూబీ మిమ్మల్ని జేబులో నుంచి ఫోన్ బయటకు తీయకుండానే మీరు కారుకు దగ్గరగా లేదా దూరంగా వెళ్లినప్పుడు వాటంతట అవే అన్‌లాక్, లాక్ అయ్యేలా అనుమతిస్తుంది. అంతేకాకుండా కారులోపల అడుగుపెట్టగానే కారు కీ రీడర్ సాయం లేకుండానే ఇంజిన్‌ను కూడా ఆన్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఫోన్ బ్యాటరీ డెడ్ అయితే?
బ్యాటరీ డెడ్ కారణంగా మీ ఆండ్రాయిడ్ డివైజ్ షట్ డౌన్ అయినప్పుడు, అది NFCని ఆపరేట్ చేయడానికి తగినంత బ్యాటరీ పవర్‌ను కలిగి ఉంటుంది. కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయడానికి మీరు దానిని కారు డోర్, NFC రీడర్‌కు దగ్గరగా తీసుకురావచ్చు.
ఫిజికల్ కీ మస్ట్!
Google Walletతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కార్ కీగా మార్చడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, వీలైనప్పుడల్లా ఫిజికల్ కీని మీ వెంట తీసుకెళ్లండి. ఎందుకంటే దారిలో అనుకోకుండా మీ ఫోన్ పోయినా లేదా డ్యామేజ్ అయినా మీ వెంట తీసుకెళ్లే తాళం మీకు ఉపయోగపడుతుంది.
ఆండ్రాయిడ్ డిజిటల్ కార్ కీ షేరింగ్!
Android Digital Car Key Sharing : మీ డిజిటల్ కారు కీ సంబంధించిన యాక్సెస్ వివరాలను మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతోనూ షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఈ వివరాలను మీరు వారితో పంచుకోవచ్చు. ఆథరైజేషన్ కోసం ఆక్టివేషన్ కోడ్‌తో కూడిన షేరింగ్ లింక్‌ను ఇతరులకు ఫోన్ ద్వారా లేదా ఏదైనా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా షేర్ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ డిజిటల్ కార్ కీ ఫీచర్ సేఫేనా?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో మీ కారును అన్‌లాక్, లాక్ చేయడం లాంటి చిన్న చిన్న అంశాలు మిమ్మల్ని కొన్నిసార్లు భయాలకు గురిచేయవచ్చు. ఎందుకంటే మీకు తెలియకుండా ఎవరైనా మీ ఫోన్ ద్వారా మీ వాహనాన్ని ఆపరేట్ చేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో భద్రత కోసమే గూగుల్ కొన్ని రకాల ఆప్షన్లను గూగుల్ వాలెట్లో అందుబాటులో ఉంచింది. ఉదాహరణకు మీరు Google Wallet సెట్టింగ్స్‌లో పాస్సివ్ ఎంట్రీని టర్న్ ఆప్ చేయవచ్చు. అంతేకాకుండా డిజిటల్ కార్ కీ కోసం ఓపెన్ చేసే స్క్రీన్కు పాస్వర్డ్స్ లాక్ లాంటివి పెట్టుకోవచ్చు.
ఇకపై వాట్సాప్ పేమెంట్స్ మరింత ఈజీ - చాట్ లిస్ట్‌లోనే QR కోడ్!
అదిరిపోయే కెమెరా ఫీచర్స్‌తో - త్వరలో ఐఫోన్ 16 లాంఛ్ - ధర ఎంతంటే?