Apple WWDC Event : అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ ఈ 2024లో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్ 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్' (WWDC) తేదీలను ప్రకటించింది. యాపిల్ కంపెనీ ఏటా తాము తీసుకురానున్న సరికొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా WWDC 2024ను వర్చువల్‌గా జూన్ 10 నుంచి జూన్14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఏఐ టెక్నాలజీ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏఐ హవా నడుస్తోంది. ఈ తరుణంలో యాపిల్ కంపెనీ తీసుకురానున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కచ్చితంగా జోడించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత జెన్‌ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్ కృషి చేయవచ్చని తెలుస్తోంది. ఇక ఐఓఎస్ 18, ఐపాడ్ఓఎస్ 18, మ్యాక్ఓఎస్ 15, వాచ్ఓఎస్ 11, టీవీఓఎస్ 18 అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS) వివరాలను కూడా యాపిల్ పరిచయం చేయనుందని సమాచారం వస్తోంది. వీటితోపాటు యాపిల్ కంపెనీ ఐపాడ్ ఎయిర్, ఓఎల్‌ఈడీ ఐపాడ్ ప్రోలో కొత్త మోడల్స్‌ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Apple iOS 18 Update : యాపిల్ కంపెనీ ఈ ఏడాది ఐఓఎస్ 18 అప్డేట్ను రిలీజ్ చేయనుంది. దీనిలో ఏఐ-పవర్డ్ సిరి, యాప్ సైడ్ లోడింగ్, థర్డ్ పార్టీ పేమెంట్ గేట్‌వే, పవర్ఫుల్ వెబ్బ్రౌజర్స్, ఆర్సీఎస్ ప్రోటోకాల్ సపోర్ట్ లాంటి బోలెడు మంచి ఫీచర్లు ఉన్నాయని సమాచారం. అలాగే యాపిల్ త్వరలో తన సరికొత్త ఐఫోన్ 16ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది.
నేరుగా చూడాలనుకుంటున్నారా?
యాపిల్ ఈ WWDC కాన్ఫరెన్స్‌ను ఆన్లైన్లో నిర్వహించనుంది. అయినప్పటికీ ఈ కాన్ఫరెన్స్‌కు మొదటి రోజు వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది. కనుక ఆసక్తి ఉన్న వాళ్లు నేరుగా యాపిల్ డెవలపర్ యాప్, కంపెనీ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టూడెంట్స్‌కు ఉపయోగపడే టాప్-5 ఏఐ టూల్స్ ఇవే! - AI Tools for Students