Work From Home Culture: కొవిడ్ విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత వైరస్ ప్రభావం తగ్గడంతో ఆఫీసులకు రావాలని సూచించాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు సంస్థలు.. ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ పిలుపునిచ్చాయి. అయితే ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇంటి నుంచి పని చేయడానికే ఎక్కువశాతం మక్కువ చూపుతున్నారు.
అలాంటి ఉద్యోగులకు దిగ్గజ టెక్ సంస్థ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ షాక్ ఇచ్చింది. వారానికి ఐదు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాలంటూ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈవో మాట్ గార్మాన్ బహిరంగంగా వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఇష్టం లేనివారు ఉద్యోగం వదిలేయొచ్చని ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన అన్నారు.
"వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలి. 10 మంది ఉద్యోగుల్లో 9 మంది ఈ విధానాన్ని స్వాగతించారు. ఆఫీస్ వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడనివారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకునే వారికి బయట చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు కొత్త విధానాల అమలుకు కృషి చేస్తున్నాం. రిమోట్ వర్క్ కారణంగా కొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో సహకారం కష్టంగా మారుతోంది. మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తే కంపెనీ లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టం." - మాట్ గార్మాన్, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈవో
ఈ కొత్త విధానం ఎప్పటినంచంటే?: అమెజాన్ సీఈవోగా యాండీ జెస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ముగింపు పలకాలని నిర్ణయించారు. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాలని ఆయన ఆదేశించారు. కంపెనీలో ఆవిష్కరణలను మెరుగుపరచడానికి ఐదు రోజులు ఆఫీస్‌కు రావడం చాలా అవసరమని ఆండీ జాస్సీ గత నెలలో ప్రకటించారు. ఈ కొత్త విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలనే విధానం అమల్లో ఉంది.
కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌ను నియమించిన గూగుల్- ఆయన ఎవరో తెలుసా?