YSRCP MLC Duvvada Audio Leak : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్‌లో బెదిరించారు. ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు పొక్కడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కుటుంబ విభేదాలతో వీధినపడ్డ శ్రీనివాస్ ఈ వివాదంతో మరింత ఇరుకునపడ్డారు. దువ్వాడ సన్నిహితురాలు దివ్వల మాధురికి చెందిన తలగాం కూడలిలోని పెట్రోలు బంకు అనుమతులు తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత రిఫైనరీకి చెందిన అధికారిని ఎమ్మెల్సీ ఫోన్‌లో బెదిరించినట్లుగా ఆ ఆడియోలో ఉంది.
Duvvada Threatened Officer in Phone : పోర్టు నిర్మాణానికి రోజుకు 20,000 లీటర్ల ఇంధనం అవసరమవుతుందని, వెంటనే అనుమతులు పునరుద్ధరించాలని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిస్తూ మాట్లాడారు. ఆ బంకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని, డీలర్‌షిప్ కూడా తొలగించామని సంబంధిత అధికారి పేర్కొన్నారు. ఇప్పుడు పునరుద్ధరించడం సాధ్యం కాదని వివరించారు. దీంతో దువ్వాడకు, ఆయనకు మధ్య మాటామాట పెరిగింది.
ఈ క్రమంలోనే వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. 'పై అధికారులకు చెప్పానని, వాళ్లు చెప్పినా ఎందుకు చేయవని, నేనేమైనా రోడ్డు పక్కన వెళ్లిపోయే వాడిననుకుంటున్నావా అంటూ' శ్రీనివాస్ తీవ్ర స్వరంతో ఆ అధికారిని హెచ్చరిస్తున్నట్లు ఆడియోలో ఉంది. ఇప్పుడు తాజాగా అది బయటకు రావడంతో ఆడియో వైరల్‌గా మారింది.
Duvvada Srinivas Family Controversy : మరోవైపు గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా విడిగా ఉంటున్న దువ్వాడను కలిసేందుకు కుమార్తెలు ఇంటికి వెళ్లగా, ఆయన లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై భార్య దువ్వాడ వాణి తీవ్రంగా స్పందించారు. తమ గౌరవాన్ని, కుటుంబ నేపథ్యాన్ని మంటగలుపుతున్నారంటూ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నారని, ఆమె ఉచ్చులో చిక్కుకున్నారని వాణి ఆరోపించారు.
Duvvada Srinivas Family Issue Updates : అనంతరం ఆమె వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోశారని విమర్శించారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయని, వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని చెప్పారు. రాజకీయ, వ్యాపారరంగాల్లోనూ తానే ఉండాలనే అహంకారం వాణీదని పేర్కొన్నారు. ఆఖరికి తనను పిల్లలు ప్రశ్నించేలా చేసిందని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో ట్విస్ట్ - దివ్వల మాధురికి ప్రమాదం - Divvala Madhuri Road Accident
దువ్వాడ కుటుంబ కథా చిత్రం - అర్ధరాత్రి ఏం జరిగిందంటే? - Duvvada Srinivas Family Controversy