Liquor Scam in AP : అధికారం చేపట్టిన వెంటనే దశలవారీ మద్య నిషేధం ముసుగులో మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని జగన్ అండ్ కో తీసుకువచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని అతి పెద్ద కుంభకోణానికి తెరలేపింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ జగన్ సర్కార్ గుప్పిట పెట్టుకుని ఐదేళ్లలో భారీగా దోచుకుంది. వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగన్‌మోహన్‌రెడ్డి కాగా, వైఎస్సార్సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. వీరి బినామీలనే పేరున్న కంపెనీలకే ఐదేళ్లలో దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కడం వీటికి బలం చేకూరుస్తోంది.
సకల శాఖల మంత్రిగా పేరొందిన వ్యక్తి, సీఎంఓలో అన్నీ తానై వ్యవహరించిన ఓ అధికారికి దీనిలో భాగస్వామ్యం ఉందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. ఈ కుంభకోణం సూత్రధారి, అంతిమ లబ్ధిదారు, అందులో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు, వారి మూలాలు పూర్తిగా బయటకు తీసేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో( ED) సమగ్ర దర్యాప్తు చేయించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
వైఎస్సార్సీపీ పాలనలో వేలకోట్ల మద్యం కుంభకోణం - AP CID Raids in Beverages Vasudeva Reddy House
డిస్టిలరీలను చేజిక్కించుకుని, జే బ్రాండ్లను జనంపైకి వదిలి : కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు తొలుత సన్నిహితులతో బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలు ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్రంలో ఇతరుల యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీస్‌ను వైఎస్సార్సీపీ నాయకులు సామదానభేద దండోపాయాలు ప్రయోగించి చేజిక్కించుకున్నారు. అక్కడి నుంచే ఊరూ పేరూ లేని 'జే బ్రాండ్లు’ తయారు చేయించి జనంపైకి వదిలారు. వీటితో పాటు ఒక్కో కేసుకు తాము అడిగినంత కమీషన్ చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. అంతకు ముందున్నవి, గతంలో ప్రాచుర్యం పొందిన బ్రాండ్లేవీ లేకుండా, కేవలం జే బ్రాండ్లే అమ్మారు. డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం లేకుండా నగదు తీసుకుని మద్యం అమ్మారు. మొదటి నుంచి చివరి వరకూ మద్యం వ్యాపారం మొత్తాన్ని మాఫియా తరహాలో గుప్పిట్లో పెట్టుకుని దోచుకున్నారు.
మొత్తం మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే! : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ నంబర్-2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణమంతా జరిగిందన్న ఫిర్యాదులున్నాయి. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం, అడిగినంత కమీషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన కమీషన్ల సొమ్మును ‘బిగ్‌బాస్’కు చేర్చటంలో ఈయనదే ప్రధాన పాత్ర అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని తెర ముందు పెట్టుకుని మొత్తం అక్రమ వ్యవహారాలు నడిపించారన్న విమర్శలున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఈ కుంభకోణంలో పాత్రధారులైన అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖలో ప్రచారం జరుగుతోంది.
అడ్డగోలుగా జే బ్రాండ్ల మద్యం విక్రయాలు - పోతున్న ప్రాణాలు - YSRCP Supplying Deadly J Brand
ఎస్పీవైను గుప్పిట్లో పెట్టుకుని రూ.6 వేల కోట్ల మద్యం దందా : అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అతి పెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను మిథున్‌రెడ్డి అనధికారికంగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లాలోని సెంటినీ బయోప్రొడక్ట్స్ డిస్టిలరీలోనూ పాగా వేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్లు’తయారు చేయించారు. ఏపీఎస్‌బీసీఎల్(APSBCL) 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు మధ్య కేవలం 25 నెలల వ్యవధిలో ఏకంగా 18 వందల 63 కోట్ల విలువైన కోటీ 16 లక్షల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీకి కట్టబెట్టింది.
జగన్ సర్కార్ ఐదేళ్లలో పరిపాలన ఈ కంపెనీకి ఇచ్చిన మద్యం సరఫరా ఆర్డర్ల విలువ రూ. 6 వేల కోట్లపైనే ఉంటుందనేది అనధికారిక అంచనా. మద్యం తయారు చేసేది, దాన్ని ఏపీఎస్‌బీసీఎల్‌తో (APSBCL) కొనుగోలు చేయించింది రెండూ మిథున్‌రెడ్డేనని ఫిర్యాదులున్నాయి.
జగనన్న మద్యం దుకాణాలు - ఉమ్మడి అనంతలో 33వేల మంది ఆస్పత్రి పాలు - ap liquor brands
అల్లుడి బినామీ పేరుతో కంపెనీ పెట్టి విజయసాయిరెడ్డి దందా : వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గత ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిన 2 నెలలకే తన అల్లుడైన పెనక రోహిత్‌రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీ పెట్టించి భారీగా దోచుకున్నారన్న ఫిర్యాదులున్నాయి.
2 డిసెంబరు 2019న అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌లో పురుడు పోసుకుంది. ఈ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్( VDPL), పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్(PMKDPL), ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను సబ్‌లీజు పేరిట అనధికారికంగా ఆధీనంలోకి తీసుకుని జే బ్రాండ్లు తయారు చేసి జనంపైకి వదిలారు. కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీకి కేవలం 25 నెలల వ్యవధిలో రూ.1164 కోట్ల 86 లక్షల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. గత నాలుగున్నరేళ్లలో 4 వేల కోట్ల రూపాయలు విలువైన సరఫరా ఆర్డర్లు లభించినట్లు అనధికారిక లెక్క అంచనా.
ఏపీలో మద్యపానం ప్రాణాంతకం - జే బ్రాండ్ మద్యంతో పేదిళ్లలో చావుడప్పు
ఏ బ్రాండ్లు అమ్మాలో చెప్పేది కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే : కాశీచయనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుధ్‌రెడ్డిలు డైరెక్టర్లుగా అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా కొనసాగిన శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కాశీచయనుల శ్రీనివాస్ కొన్నాళ్ల పాటు డైరెక్టర్‌గా ఉన్నారు. ముప్పిడి అనిరుధ్‌రెడ్డి. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన, మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడు అవుతాడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి? ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం అమ్మాలన్నది రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది. అదాన్ కంపెనీ( Adani Company) సరఫరా చేసిన అదాన్స్ సుప్రీమ్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, 9 సీహార్సెస్ విస్కీ, ఏసీ బ్లాక్ రిజర్వు విస్కీ వంటి బ్రాండ్లను మాత్రమే కొన్నాళ్లపాటు దుకాణాల్లో అమ్మించారు. ఈ మద్యం కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనేక చోట్లకు వ్యాపించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
'జే బ్రాండ్'తో పేదల ప్రాణాలు తీస్తున్నారు - మహిళలు జాగృతమైతేనే మార్పు : సోమిరెడ్డి
దిల్లీ మద్యం కుంభకోణం కీలకపాత్రధారి శరత్‌చంద్రారెడ్డి సంస్థతో లింకులు : దిల్లీ మద్యం కుంభకోణం అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ఏపీలోని అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య విడదీయరాని అనుబంధముంది. దిల్లీ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనక శరత్‌చంద్రారెడ్డిని ఈడీ ఏడాదిన్నర కిందట అరెస్టు చేసింది. ఈ కుంభకోణంలో ఆయన చక్రం తిప్పారని దిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతం ఆయన గుప్పిట్లోనే ఉందని ఈడీ వెల్లడించింది. ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (TKPL) పాటు మరికొన్ని బినామీ సంస్థల ద్వారా ఈ వ్యవహారాలు నడిపించారని పేర్కొంది. అదాన్ డిస్టిలరీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన కాశీచయనుల శ్రీనివాస్ ఈ ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనే( TKPL) గతంలో సీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు.
జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల్లో నగదు మాత్రమే- నో డిజిటల్ పేమెంట్స్: గంటా
ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 99.99 శాతం వాటాలు ఆర్‌పీఆర్ సన్స్ అడ్వయిజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్నాయి. ఆర్‌పీఆర్ సన్స్ కంపెనీలో(RPRS Company) విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి 2021 ఏప్రిల్ 21న డైరెక్టర్‌గా చేరారు. రోహిత్‌రెడ్డితో పాటు పెనక వెంకట రామ్‌ప్రసాద్‌రెడ్డి, పి.సుశీలరాణి డైరెక్టర్లుగా ఉన్నారు. పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో(SBPL Company) కాశీచయనుల శ్రీనివాసులు 2021 జూన్ 19 వరకూ డైరెక్టర్‌గా కొనసాగారు. అప్పుడే ఆయన అదాన్ డిస్టిలరీని స్థాపించారు.
శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ చిరునామా, దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చిరునామాలు ఒకటే. హైదరాబాద్‌లోని మియాపూర్ సర్వే నంబర్ 66, 67 చిరునామాలతో ఈ రెండు కంపెనీలు రిజిస్టరై ఉన్నాయి ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెనక శరత్ చంద్రారెడ్డి 21-02-2007 నుంచి 27-05-2018 వరకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన సోదరుడు, ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి 27-01-2010 నుంచి 9-03-2018 వరకు డైరెక్టర్‌గా కొనసాగారు. ప్రస్తుతం వారిద్దరూ సాంకేతికంగా ఆ కంపెనీలో డైరెక్టర్లుగా లేకపోయినప్పటికీ దిల్లీ మద్యం కుంభకోణంపై దాఖలు చేసిన కస్టడీ రిపోర్టులో ట్రైడెంట్ సంస్థ(TKPL) శరత్‌చంద్రారెడ్డికి చెందిన గ్రూప్ కంపెనీ అంటూ గతంలో ఈడీ(ED) పేర్కొంది. ఏపీలో చోటుచేసుకున్న కుంభకోణం మూలాలు అటు దిల్లీ వరకూ విస్తరించి ఉన్నాయి.