YSRCP Leaders Irregularities in AP: పచ్చని పంటలతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఓ ప్రజాప్రతినిధి దెబ్బకు విలవిల్లాడిపోతోంది. 'జగ్గూ భాయ్' ధనదాహానికి ఇసుక దిబ్బగా మారిపోయింది. మాగాణి భూములతో విలసిల్లే ప్రాంతం మాఫియాకు అడ్డాగా తయారైంది. జగన్ అండ తోడవడంతో హద్దూపద్దూ లేకుండా చెలరేగుతున్న 'జగ్గూ' అనతికాలంలో కోట్లకు పడగలెత్తారు.
రూ. 300 కోట్లకుపైగానే: ఒకప్పుడు బ్యాంకు రుణం సకాలంలో చెల్లించలేక బహిరంగ నోటీసు అందుకున్నారాయన. మరి ఇప్పుడు.!! అదే వ్యక్తి ఐదేళ్లలో రూ.300 కోట్లకు పైనే అక్రమంగా ఆర్జించారు. కోనసీమలోని ఓ నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధి అంతులేని అవినీతికి ఇదే నిదర్శనం. భూదందాలకు 'జగ్గూ భాయ్' పెట్టింది పేరు. వాణిజ్య కేంద్రమైన రావులపాలెం పట్టణంలో అత్యంత విలువైన వివాదాస్పద భూములను నామమాత్రపు ధరలకే చేజిక్కించుకుని కోట్ల రూపాయలు సంపాదించారు.
ఓ కుటుంబానికి చెందిన 51 సెంట్ల వ్యవసాయ భూమిని మరో కుటుంబం కొన్నేళ్లుగా సాగు చేస్తోంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన్నట్లుగా ఈ పంచాయతీలో దూరిన 'జగ్గూ భాయ్' మొత్తం ఆస్తిని కాజేశారు. అదే స్థలానికి సమీపంలోని అత్యంత విలువైన 40 సెంట్ల స్థలాన్నీ అతి తక్కువ ధరకు బలవంతంగా చేజిక్కించుకున్నారు. రావులపాలెంలోనే మరో చోట అత్యంత విలువైన 70 సెంట్ల స్థలాన్ని నామమాత్రపు ధరకే గుంజుకున్నారు. ఆ తర్వాత అందులో లేఅవుట్ వేసి ఒక్కో సెంటు స్థలాన్ని 70 లక్షలకు విక్రయంచి సొమ్ము చేసుకున్నారు.
ఎన్నికల ముంగిట జగనన్న రివర్స్ గేర్- అస్మదీయులకు 'రిజిస్ట్రేషన్' గిఫ్ట్?
స్థిరాస్తి లేఅవుట్ వేయాలంటే: తన నియోజకవర్గ పరిధిలో ఎవరైనా స్థిరాస్తి లేఅవుట్ వేయాలంటే 'జగ్గు భాయ్'కి భారీగా ముడుపులైనా ఇవ్వాలి లేదా వాటానైనా సమర్పించుకోవాలి. ఇందుకు ఎవరైనా నిరాకరిస్తే వారి పని ఇక అంతే! కొన్ని చోట్ల స్వయంగా స్థిరాస్తి లేఅవుట్‌లూ వేస్తున్న జగ్గూ వాటి అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వ శాఖలనూ నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించుకుంటున్నారు. జగనన్న కాలనీల నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణలో రూ.50 కోట్ల మేర కొల్లగొట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం 17 లక్షల నుంచి 24 లక్షల రూపాయల విలువున్న భూమిని 45 లక్షల నుంచి 60 లక్షల రూపాయల ధరకు ప్రభుత్వంతో కొనిపించారు. నియోజకవర్గ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకూ అవకాశంలేని ప్రాంతంలో 600 మందికి ఇళ్ల స్థలాల కోసమంటూ ఆ భూమిని కొనుగోలు చేయించి భారీగా లబ్ధి పొందారు. ఇసుక రీచ్‌లన్నీ ఆ ప్రజాప్రతినిధి ఆధీనంలోనే ఉన్నాయి.
2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రద్దుతో కళంకం- నిమ్మకునీరెత్తినట్లు జగన్ సర్కార్!
అనుచరులతో ఇసుక దందా : మొదట్లో జేపీ సంస్థ నుంచి రీచ్‌లను సబ్‌లీజ్‌కు తీసుకుని తన అనుచరులతో దందా నడిపించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే అడ్డగోలుగా రేవుల్లో తవ్వకాలు జరుపుతూ రూ.కోట్లలో వెనకేసుకుంటున్నారు. ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరపటంతో జొన్నాడ వద్ద గుంతల్లో పడి ఇద్దరు బాలలు ప్రాణాలు కోల్పోయారు.
సొసైటీలకు కేటాయించిన వందల ఎకరాల గోదావరి లంక భూముల్లో మట్టిని అక్రమంగా తవ్వి సమీపంలోని ఇటుక బట్టీలు, లే అవుట్‌లకు తరలిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కొమర్రాజు లంకలోని భూముల్లో మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తూ రోజూ వందల లారీల్లో తరలిస్తున్నారు. ఊబలంకలో మత్స్యకారులకు చెందిన సొసైటీ భూముల్లోనూ ఇదే తరహాలో దందా కొనసాగించారు. చివరికి ధాన్యం కొనుగోళ్లు, పంటల బీమా వ్యవహారాల్లోనూ 'జగ్గూ భాయ్' తలదూర్చుతున్నారు.
అనుచరుల ఖాతాల్లోని పరిహారం పైసలు: పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన పరిహారం సొమ్మును అసలు సెంటు భూమి కూడా లేని వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు, వాలంటీర్ల ఖాతాల్లో వేయించుకుని ఆ మొత్తాన్నీ కాజేశారు. రావులపాలెం మండలంలో స్టీల్‌ప్లాంటు, కొబ్బరి తోటలున్న భూముల్లో సుమారు 250 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు నమోదు చేసి అక్రమాలకు తెరలేపారు. నియోజకవర్గంలో ఈ నాయకుడి తరఫున ఆయన మేనమామే చక్రం తిప్పుతారు.
ఒక విధంగా చెప్పాలంటే ఆయనే షాడో ప్రజాప్రతినిధి. ముఖ్య శాఖల అధికారులు ఈ నియోజకవర్గానికి బదిలీపై రావాలంటే 'మేనమామ' దర్శనం చేసుకోవాల్సిందే. చెప్పిన ప్రతి పని చేస్తామని అంగీకరిస్తేనే వారికి పోస్టింగు ఖరారైనట్టు. కాలువల్లో పూడికనూ జగ్గూభాయ్ వదల్లేదు. నామినేషన్ విధానంలో పనులు దక్కించుకున్న ఈయన అనుచరులు నామమాత్రంగా పనులు చేసి రూ.5 కోట్లు హాంఫట్ చేశారు. పాఠశాలల్లో నాడు-నేడు పనులను అత్యంత నాసిరకంగా చేసి బిల్లులు దండుకున్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణాలకు భవనాలు అద్దెకు ఇవ్వడంలోనూ దోపిడీ చేస్తున్నారు. భవన యజమానులకు 10 వేల నుంచి 15 వేల రూపాయల బాడుగ చెల్లించి ప్రభుత్వం నుంచి మాత్రం రూ.40 వేల వరకు అద్దె కొల్లగొడుతున్నారు. మద్యం గొలుసు దుకాణాలన్నీ ఈయన అనుచరులవే. నియోజకవర్గ ముఖద్వారంగా ఉన్న ఓ పంచాయతీని పర్యాటక కేంద్రంగా చూపి బార్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.