YSRCP Leaders Illegal Sand Mining : ఆయన ఓ ముఖ్య నేతకు సోదరుడు. ఆ నాయకుడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక చోరుడిగా అవతారమెత్తాడు. ఈ అడ్డగోలు దందాను చక్కబెట్టేందుకు అక్రమ సొమ్మును చుట్టచుట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించుకున్నాడు. ఆ వ్యక్తి ఇక్కడ కాదు. అక్కడ కాదు. ఏకంగా సీఎంవోలోనే తిష్ఠావేశాడు. ఆ కార్యాలయం నుంచే చక్రం తిప్పుతూ గనుల శాఖ అధికారులను గడగడలాడిస్తున్నాడు. ఎంతలా అంటే రీచ్‌లకు దాకా తనిఖీలకు వెళ్లిన అధికారులు సైతం తోకముడుచుకుని రావాల్సిందే. ఉన్నతాధికారులతో చీవాట్లు తినాల్సిందే.
'ముఖ్య'నేత సోదరుడి చెంతకే : రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలకు 2021 మే నుంచి జేపీ సంస్థ పేరిట చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్‌కీ సంస్థ ఉపగుత్తేదారుగా వ్యవహరించింది. అది ప్రభుత్వ పెద్దలకు భారీగా కప్పం కడుతూ అడ్డగోలుగా దోచేసింది. ఈ క్రమంలో ఇసుక నుంచి భారీగా డబ్బులు పిండుకోవాలని 'ముఖ్య'నేత సోదరుడు పన్నాగం పన్నాడు. అందుకు పాచికవేసి ప్రణాళిక రూపొందించాడు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టి దాని ద్వారా వచ్చే అక్రమ సొమ్మును దండుకోవడానికి ప్రత్యేకంగా అంజిరెడ్డి అనే వ్యక్తిని నియమించుకున్నాడు. రాష్ట్రంలోని ఇసుక వ్యాపారులు అంతా ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే.
ఇంకా జిల్లాల వారీగా వైఎస్సార్సీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల బంధువులు, అనుయాయులకు ఇసుక తవ్వకాలను కట్టబెట్టి అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. వాస్తవానికి 2023 మే నెలతోనే జేపీ సంస్థ టెండరు ముగిసింది. అయినా నవంబరు వరకు దాని పేరిటనే బిల్లులు జారీ చేస్తూ వచ్చారు. అయితే గత డిసెంబరు నుంచి వేరే రెండు సంస్థలు ఇసుక టెండరును దక్కించుకున్నట్లు రికార్డుల్లో చూపారు. కానీ కప్పమంతా వెళ్లేది 'ముఖ్య'నేత సోదరుడి చెంతకే. ఆయన సూచనలతో అంజిరెడ్డి ఈ అక్రమ వ్యవహారాన్ని అంతా తానై చూసుకుంటున్నాడు.
యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు - భారీ యంత్రాలతో తుంగభద్రకు తూట్లు - Illegal Sand Mining
అంజిరెడ్డి మౌఖిక ఆదేశాలు : అంజిరెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ మాజీ ఎంపీ వద్ద చాలాకాలం పనిచేశాడు. ఆయన వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. తర్వాత ఏపీలోని ఓ ప్రముఖ కార్పొరేట్ గ్రూప్‌లో అసోసియేట్ జనరల్ మేనేజరుగా కొనసాగాడు. ఆ గ్రూప్‌కి జగన్ ప్రభుత్వం మన రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు కట్టబెట్టింది. అటువంటి సంస్థలో కొనసాగిన అంజిరెడ్డికి 'ముఖ్య'నేత సోదరుడు ఇసుక బాధ్యతలు అప్పగించాడు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ మేనేజర్, ఒక్కో రీజియన్‌కు ఒక్కో రీజియన్ మేనేజర్ చొప్పున కార్పొరేట్ స్థాయిలో నియమించుకొని అంజిరెడ్డి ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. ఇలా ఇసుక అక్రమ దందాలో 'ముఖ్య'నాయకుడు అంజిరెడ్డిని అడ్డుపెట్టుకుని ప్రతి నెల కోట్లు సంపాదిస్తూ సహజ వనరులను విధ్వంసం చేస్తున్నాడు.
అంజిరెడ్డి నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటూ హల్‌చల్ చేస్తుంటాడు. సీఎం క్యాంపు కార్యాలయంలోని ఓ కీలక అధికారితో అంజిరెడ్డి భేటీ అయ్యాడంటే చాలు మిగిలిన వారు ఎంతసేపైనా బయట వేచి ఉండాల్సిందే. జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నించినా, పర్యావరణ అనుమతుల గురించి అడిగినా వెంటనే సీఎంవో నుంచి నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్లు వెళ్తాయి. ఆయా జిల్లా అధికారులను హెచ్చరించేలా అంజిరెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తుంటాడు.
నిబంధనలు తుంగలో : 'ముఖ్య'నేత సోదరుడి కనుసన్నల్లో అంజిరెడ్డి ఈ వ్యవహారం చూస్తున్న రోజు నుంచి అనుమతులు లేకపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు మొదలయ్యాయి. ఇసుక తవ్వకాలపై మరోసారి సమీక్ష జరపాలని, కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయాలంటూ ఎన్‌జీటీ గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 110 రీచ్‌ల్లో తక్షణమే ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ ఇసుక గుత్తేదారు జేపీ సంస్థకు, గనుల శాఖకు ఆదేశాలిచ్చింది.
అయినా అంజిరెడ్డి ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆపలేదు. సియా అటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా బయటకు పొక్కకుండా చూశాడు. చివరకు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ సందర్భంగా సియా ఆదేశాల గురించి వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు సైతం సియా ఆదేశాలనే పాటించాలని ఆదేశించింది. తర్వాత కూడా తవ్వకాలను నిలిపేయకపోగా యథేచ్ఛగా కొనసాగించారు. కేవలం కూలీలతోనే ఇసుకను తవ్వాలన్న సియా నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి లారీల్లో లోడ్‌చేస్తూ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
50 వేల కోట్లు లూటీ - ఇసుక దోపిడీపై టీడీపీ, జనసేన ఆందోళనలు: అచ్చెన్నాయుడు
గనుల శాఖ అధికారుల తనిఖీలు : కలెక్టర్లు సహా గనుల శాఖ, రెవెన్యూ, ప్రత్యేక కార్యదళం, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులకు ఈ అక్రమాల గురించి తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయడంలేదు. అంజిరెడ్డి నేరుగా సీఎంవో నుంచి ఫోన్ చేయించి ఒత్తిడి తీసుకొస్తారన్న గుబులుతోనే అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్‌లో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారన్న సమాచారం మేరకు జిల్లా గనుల శాఖ అధికారులు కొన్ని నెలల క్రితం తనిఖీలకు వెళ్లారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ ఇసుకాసురులు వారిపై బెదిరింపులకు దిగారు. "ఇక్కడికి ఎందుకు వచ్చారు? తనిఖీ చేయమని ఎవరు చెప్పారు? మీరు వస్తున్నారన్న విషయం మీ శాఖ సంచాలకునికి తెలుసా? ఈ రీచ్‌లు ఎవరివి అనుకుంటున్నారు?" అంటూ వారిపై దాడికి పాల్పడినంత పని చేశారు. చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. దీనిపై గనుల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా వారి నుంచి ఎటువంటి ఉలుకూపలుకూ లేదు.
యథేచ్ఛగా దందా : పల్నాడు జిల్లాలోని ఓ ఇసుక రీచ్‌లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో కొన్ని నెలల క్రితం ఎస్‌ఈబీ ఎస్.ఐ, కానిస్టేబుళ్లు అడ్డుకునేందుకు వెళ్లారు. ఇసుక తవ్వే యంత్రాన్ని, లారీలను పట్టుకున్నారు. వెంటనే వారికి ఆ విభాగం ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. ‘ఎవరికి చెప్పి అక్కడికి తనిఖీలకు వెళ్లారు? అక్కడి నుంచి వెంటనే వెనక్కి వచ్చేయండి’ అని హుకుం జారీ చేశారు. దీంతో వారు చేతులుముడుచుకుని వెళ్లిపోక తప్పలేదు.
గతేడాది జూన్, జులై నెలల్లో కోనసీమ జిల్లాలోని గనుల శాఖ అధికారులు జొన్నాడ, ఓబుల్లంక రీచ్‌ల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారి ఆ అధికారులకు ఫోన్ చేసి వెంటనే వెనక్కి వచ్చేయాలంటూ ఒత్తిడి చేశారు. కొన్ని నెలల క్రితం ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా ఇసుక తవ్వకాలు సాగాయి. ఇసుకను అక్రమంగా ఎందుకు తవ్వుతున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తే తాము సీఎంవోకు చెందినవారమంటూ దర్జాగా చెబుతూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగించారు. ఇలా 'ముఖ్య'నేత సోదరుడి అండదండలతో అంజిరెడ్డి అంతాతానై అక్రమ ఇసుక తవ్వకాలు జరిపినా ఎవరూ పట్టించుకోలేకపోయారు.
అంతా జగన్నాటకం - ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం అవే పాత అబద్ధాలు!