YSRCP Leaders Distributing Gifts to People : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో తాయిలాలతో వాలంటీర్లు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులను మచ్చిక చేసుకుని వారితో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బందిని ఆకట్టుకునేందుకు వైసీపీ నాయకులు తాయిలాలు సమర్పించుకుంటున్నారు.
ఓటర్లకు వైఎస్సార్సీపీ ఎర - ఉపాధ్యాయినులకు మంత్రి రోజా తాయిలాలు
East Godavari : రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి మార్గాని భరత్ ఓటర్లకు తాయిలాల పంపిణికీ శ్రీకారం చుట్టారు. పార్టీ ముఖ్యనాయకుల పర్యవేక్షణలో శనివారం నుంచి పలు వార్డుల్లో ఆటోలు, మినీ వ్యానుల్లో తాయిలాలు తీసుకుని ఇంటింటికీ వెళ్లి, ఎంపీ ఫోటోతో ఉన్న బాక్సులో చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఎంపీ అనుచరులు ఇద్దరు, గృహసారథి, వాలంటీర్లతో పాటు కొందరు సచివాలయ సిబ్బంది పంపిణీని పర్యవేక్షించారు. ఓటరు జాబితా ఆధారంగా పంపిణీ చేస్తూ ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు చూసి తాయిలాలు పంపిణీ చేస్తున్నారు.
షెడ్యూల్‌కు ముందే వైసీపీ తాయిలాల పర్వం - ఆసరా సభలో చీరలు పంపిణీ
అనపర్తి మండలం కొప్పవరంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి పలువురు వాలంటీర్లకు శుక్రవారం బహుమతులు అందజేశారు. పంచాయతీ పరిధిలోని పన్నులను 100 శాతం వసూళ్లు చేసిన వారిని అభినందించి బహుమతులు అందజేసినట్లు ఎమ్మెల్యే తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశారు. ఇటీవల రాజానగరంలో ఉగాది బహుమతుల పేరిట ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మి వాలంటీర్లకు బహుమతులు అందజేశారు. కోరుకొండ మండలంలో క్షేత్రస్థాయి సిబ్బందికి చీరలు, ప్యాంటు, చొక్కా ఇచ్చారు.
అనపర్తి మండలం పరిధిలో ఉన్న గాడాల, మధురపూడి, నిడిగట్ల, బూరుగుపూడి, బుచ్చెంపేట, గుమ్ములూరు, కోరుకొండ, కాపవరం గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు సీఎం జగన్, ఎమ్మెల్యే రాజా చిత్రాలతో ఉన్న సంచులు అందజేశారు. గ్రామాల్లో ఎమ్మెల్యే రాజా సతీమణి రాజశ్రీ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేపట్టారు. పనిలో పనిగా పలువురు వాలంటీర్లను సత్కరించారు.
ఎన్నికల కోసం పాత్రికేయులకు ప్రలోభాలు- కొనసాగుతున్న వైసీపీ నేతల తాయిలాలు
Tirupati District : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నారద పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవాన్ని జరిపారు. ఉత్సవం అనంతరం మహిళలకు బ్రహ్మోత్సవ కానుకగా చీరల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనుచరులు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మహిళలు భారీగా రావడం, చీరల కోసం పోటీలు పడటంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో అధికార పార్టీ నేతలు చీరలను గాల్లోకి విసరడం ప్రారంభించారు. ఫలితంగా మరింత గందరగోళం ఏర్పడింది.
అధికార పార్టీ నాయకులు బాహాటంగానే తాయిలాలు పంపిణీ చేస్తున్నా అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడంపై ప్రజలు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.