YSRCP Leader Illegally Encroaching Lands: విజయనగరం జిల్లాలో ఓ కోటలాంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే వైసీపీ ప్రజాప్రతినిధి అక్రమార్జనలో ఆరితేరారు. నియోజకవర్గంలో ఎవరైనా లేఅవుట్ వేయాలంటే, విస్తీర్ణాన్ని బట్టి వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలం ఆయనకు సమర్పించుకోవాల్సిందే. ఐదేళ్లలో దాదాపు 40 కోట్ల విలువైన స్థలాలను తన బినామీల పేరిట రాయించుకున్నారు. కొత్తగా లేఅవుట్ వేసే వారు ఆ ప్రజాప్రతినిధి సోదరుడిని తొలుత ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే భూమార్పిడి సహా ఇతర అనుమతులకు మోక్షం లభిస్తుంది. అధికారులు కూడా ఆ ప్రజాప్రతినిధి సోదరుడి ఇంటికి వెళ్లి ఆయనిచ్చిన ఆదేశాల మేరకే పని చేస్తారు. ఎవరైనా అలా చేయకపోతే బదిలీ వేటు తప్పదు.
నియోజకవర్గంలోని ఖాళీ స్థలాలను, వివాదాస్పద భూములను గుర్తించేందుకు ఆ ప్రజాప్రతినిధి ఏకంగా ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ బృంద సభ్యులు గ్రామాల్లో సంచరిస్తూ ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తారు. వాటి ఆధారంగా భూముల్ని కబ్జా చేసేందుకు ప్రణాళికల్ని రచించి అమలు చేస్తుంటారు. ఈ పనుల్ని చక్కబెట్టేందుకు కొందరు అధికారుల్ని మోహరించుకున్నారు. పేరుకే ప్రజాప్రతినిధి తప్ప ఐదేళ్లుగా ఆయన దృష్టంతా భూముల కబ్జాపైనే.
కొత్తవలస మండలం అర్థానపాలెం పరిధిలో ఓ రాజు పేరిట ఉన్న 14.40 ఎకరాల భూమిని ఆ ప్రజాప్రతినిధి అత్తవారింటి తరఫు బంధువులు గతంలో ఆక్రమించుకున్నారు. తాను గెలిచిన తర్వాత అధికారులపై ఒత్తిడి చేసి పట్టాదారు పాసు పుస్తకాలను చేయించారు. ప్రతిఫలంగా మెయిన్ రోడ్డు పక్కనే అత్యంత విలువైన 25 సెంట్ల స్థలాన్ని వారి నుంచి తీసుకున్నారు. ఆ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి, ఓ ఇంటిని నిర్మించుకున్నారు. స్థానిక స్థిరాస్తి వ్యాపారులు కొందరు ఈ భవనాన్ని తమ సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చారు.
దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే
రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయించి: కొత్తవలస మండలం గులివిందాడలో ఒక లేఅవుట్ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకుని 15 కోట్ల విలువైన మూడెకరాల భూమిని నామమాత్రపు ధరకు లాగేసుకున్నారు. చింతలపాలెంలోని 17.23 ఎకరాల ప్రభుత్వ భూమి, 18.71 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమి ఓ నాయకుడి ఆధీనంలో ఉంది. ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు విలువైన 35.94 ఎకరాల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయించారు. ప్రతిగా 25 కోట్ల రూపాయల వరకు అందుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని అమ్మచెరువులో 10 కోట్ల విలువైన 4.86 ఎకరాలను, వీరసాగరం చెరువులో 3 కోట్ల విలువైన 2.90 ఎకరాలను ఆక్రమించేశారు. దెందేరు గ్రామంలో పది మంది యాదవులకు సంబంధించిన 3 కోట్ల విలువైన రెండెకరాల భూమిని నకిలీ 1బీతో కాజేశారు.
కొత్తవలస మండలంలోని ఒక గ్రామంలో గిరిజనులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న 108 ఎకరాల భూమి విషయంలో కొంత వివాదం ఉంది. సమస్య పరిష్కరిస్తానని నమ్మబలికిన ఈ ప్రజాప్రతినిధి 12 ఎకరాలను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమి విలువ 60 కోట్ల పైమాటే. ఆ తర్వాత అదే భూమిలో స్థిరాస్తి వెంచర్ వేసేందుకు ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకున్నారు. వారిని వెనకుండి నడిపించారంటూ వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలిపైనే పోలీసు కేసు పెట్టించారు.
అర్థానపాలెంలోని ఆరెకరాల స్థలం రెవెన్యూ దస్త్రాల్లో ఒకచోట జిరాయితీగా, మరోచోట గయాల్ భూమిగా నమోదై ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేయించారు. అందులో 5 కోట్ల విలువైన ఎకరం భూమిని తన పరం చేసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన ఓ తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ సాయంతో కొత్తవలస, చింతలపాలెం, దెందేరు, గులివిందాడ, రెల్లి, సంతపాలెం, తదితర గ్రామాల్లో కొన్ని రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయించి భూముల్ని ఆక్రమించుకున్నారు.
విజయనగరంలో సెటిల్మెంట్ల దందా - ఆ నేత కన్నుపడితే ఆశలు వదులుకోవాల్సిందే
ఎక్కువ మొత్తం చెల్లిస్తే కోరుకున్న చోట పోస్టింగ్: ఎక్కువ మొత్తం చెల్లిస్తే కీలక పోస్టుల్లో అధికారులను నియమిస్తానని ఆ ప్రజాప్రతినిధి బేరాలు పెట్టేశారు. ఒక ఇన్‌స్పెక్టర్ వద్ద 5 లక్షలు తీసుకుని ఓ స్టేషన్‌లో పోస్టింగు ఇప్పించడం చర్చనీయాంశమైంది. ఒక స్థిరాస్తి వ్యాపారితో కలిసి ఈ ప్రజాప్రతినిధి కొంత భూమిని కొన్నారు. అది వాణిజ్య భూమిగా అధికారిక దస్త్రాల్లో నమోదై ఉన్నా వ్యవసాయ భూమిగా రాయాలంటూ అధికారులపై ఒత్తిడి చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో తహసీల్దారును ఆఘమేఘాలపై బదిలీ చేయించారు. ఉపాధి హామీ నిధులతో నియోజకవర్గంలో జరిగిన పనులకు సొంత మనుషులకు అప్పగించుకొని కమీషన్లు తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికారులతో స్థిరాస్తి వ్యాపారులకు ఫోన్లు చేయించి కోటి రూపాయల వరకు వసూలు చేశారు. అనధికారిక రీచ్‌లలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి భారీగా డబ్బులు వెనకేసుకున్నారు. పర్యావరణ అనుమతి ధ్రువపత్రాల జారీ కోసం స్టోన్ క్రషర్ల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారు. స్థానికంగా ఉన్న ప్రధాన ఫ్యాక్టరీలలో సరకు రవాణా వాహనాల కాంట్రాక్టును సంబంధిత యాజమాన్యాలను బెదిరించి మరీ తీసుకున్నారు. అప్పటికే ఈ రంగంలో ఉన్న కొంతమందిని బలవంతంగా పక్కకు తప్పించారు.
ఒంగోలులో అధికార పార్టీ నేతల అండతో పేట్రేగిపోతున్న భూ మాఫియా ఆగడాలు