YSRCP Govt Negligence on Urban Development : రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో తాగునీరు సహా కనీస మౌలిక సదుపాయాల సమస్యలు తిష్టవేశాయి. చాలాచోట్ల దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగు కోసం చేపట్టిన ప్రాజెక్టులపై గత నాలుగేళ్లలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. అలాగే పట్టణాలు, నగరాల్లో మురుగు, చెత్త నిర్వహణ, రహదారుల విస్తరణ, మరమ్మతులు వంటి అభివృద్ధి పనులపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. సంపద సృష్టించడం చేతకాక లేనిపోని పేర్లతో పన్నుల వసూళ్లపైనే ప్రభుత్వానికి ఆసక్తి ఉందని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా రోజూ వీధుల్లో చెత్తతోపాటు ఇళ్ల నుంచి సేకరించే వ్యర్థాలను దాదాపు 1200 మెట్రిక్ టన్నుల వరకు నేరుగా యార్డులకు తరలిస్తున్నారు. యార్డులు లేనిచోట్ల రోడ్లకు ఇరువైపులా పారబోస్తున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక డంపింగ్ యార్డులు నిండిపోవడంతో వ్యర్థాలను రహదారులకు ఇరువైపులా, చెరువుల్లో వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, అనంతపురం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలాచోట్ల మురుగు నీటిని నదుల్లోకి వదిలేస్తున్నారు. ఈ తీరును జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) అనేక సందర్భాల్లో తప్పుపట్టింది. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.
వాంబే కాలనీ వాసుల వ్యధ - ఈ నీరు తాగేదెలా? - Drinking Water Problem
సముద్రంలోకి విడిచిపెడుతున్నారు: రాష్ట్రంలోని అంతర్గత రహదారులు, మురుగుకాల్వలు చిందరవందరగా తయారయ్యాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో సమస్య జఠిలమవుతోంది. పుర, నగరపాలక సంస్థల్లో రోజూ వస్తున్న మురుగునీటిలో కేవలం 15 శాతమే శుద్ది చేస్తున్నారు. మిగిలిన నీటిని నేరుగా నదులు, సముద్రంలోకే విడిచిపెడుతున్నారు. పలుచోట్ల నీటిని శుద్ధి చేసే కేంద్రాలు ఉన్నా, నిర్వహణ లోపంతో అవి పనిచేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమృత్ పథకంలో భాగంగా 21 మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులు ప్రారంభించారు. వీటిలో ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తి చేసినవి కేవలం అయిదే. పలు నీటి అవసరాలకు నదులపై ఆధారపడిన ప్రజలు ఈ కలుషిత నీటితో అనారోగ్య బారిన పడుతున్నా, జగన్ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు.
అవినీతి తాండవిస్తోంది: విశాఖలోని ఆర్కే బీచ్లో పర్యాటకుల పక్క నుంచే మురుగు నీరు వెళ్లి సముద్రంలో కలుస్తున్నా నివారణ చర్యలు లేవు. మురుగునీటిని శుద్ధి చేశాకే నదుల్లో, సముద్రంలో విడిచి పెట్టాలన్న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు. మురుగునీటితో నదులు కాలుష్యమయమవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. విజయవాడ వంటి నగరాల్లో పాలకుల నిర్లక్ష్యం, పనుల్లో అవినీతి తాండవిస్తోందని మాజీ ప్రజాప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు.
పట్టణాలు, నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో పాలకులు ప్రణాళికాయుతంగా, చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. ఇప్పటికైనా పట్టణ, నగరాభివృద్ధిపై పాలకులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
"రాష్ట్రంలో సుమారు 30 శాతం మంది జనం పట్టణాల్లో నివసిస్తున్నారు. పట్టణాభివృద్ధి అనేది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకం. అయినా ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. పట్టణాల్లో మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా మార్చేశారు. వాటికి కేటాయించిన నిధులను సైతం మళ్లిస్తున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు". - సి.హెచ్.బాబూరావు, పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్
విజయవాడలో పడకేసిన పారిశుద్ధ్యం- మృత్యుపాశాలుగా మారుతున్న డ్రైనేజీలు