TIDCO Houses Construction Pending: టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2 లక్షల 68 వేల గృహాల నిర్మాణాలను పూర్తి చేస్తామని బీరాలు పలికిన పాలకులు, చేతల్లో మాత్రం చూపించలేదు. లక్షా 51 వేల ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు అందించారు. వీటిల్లో ఎన్నికల ముందు హడావుడిగా ఇచ్చినవే 50 వేలు ఉన్నాయి.
ఇప్పటికీ ఇంకా లక్షా 17 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది. గృహసముదాయాల్లో మౌలిక వసతులతో కలిపి వీటిని పూర్తి చేసేందుకు 5 వేల 872 కోట్లు అవసరమని అధికారులు లెక్కకట్టారు. ఈ మేరకు తాజాగా కేంద్రానికి నివేదించారు. లబ్ధిదారుల వాటా కింద 35 వేల మంది నుంచి 15 వందల 82 కోట్లు సమీకరించాల్సి ఉండగా మిగతా 4 వేల 290 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.
మరో 5 వేల 872 కోట్లు అవసరమని అంచనా: లబ్ధిదారులకు అప్పగించాల్సిన ఇళ్ల నిర్మాణాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు ఉన్నాయి. మొత్తంగా కోస్తాంధ్రలో 50 వేల గృహాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. రాయలసీమ జిల్లాల్లో 40వేల ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి.
మిగతావి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనివి. టిడ్కో ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అప్పగించేందుకు ఖర్చు చేయాల్సిన 5 వేల 872 కోట్లలో గృహ సముదాయాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, మురుగు కాల్వలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం 15 వందల కోట్ల వరకు అవసరమని అధికారులు లెక్కలేశారు. మిగతా 4 వేల 372 కోట్ల రూపాయలను ఇళ్ల నిర్మాణాల పూర్తికి వినియోగించాల్సి ఉందని అంచనా వేశారు.
టిడ్కో ఇళ్ల రుణ మాఫీపై మడమ తిప్పిన జగన్ - Jagan Fraud Tidco Beneficiaries
వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్: వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయకుండా పేదల్ని ఇబ్బంది పెట్టడమే కాదు, అవసరం మేరకు టిడ్కోకు నిధులు కూడా విడుదల చేయలేదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని సమీకరించుకోవాలని చెప్పి చేతులు దులిపేసుకుంది. టిడ్కో సంస్థ అప్పుల కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆర్థిక, వాణిజ్య సంస్థలకు నమ్మకం లేక రుణాలిచ్చేందుకు వెనుకడుగు వేశాయి. ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తామన్నా ముందుకు రాలేదు. అప్పటికే హడ్కో నుంచి 5 వేల కోట్ల వరకు టిడ్కో అప్పుగా తీసుకుంది. గుత్తేదారులకు ఇంకా వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్ పెట్టినట్టు సమాచారం.