YSRCP government Neglected Mahila Pragathi Pranganam Development at Guntur District : గుంటూరు మహిళా ప్రగతి ప్రాంగణం! ఈ పేరు చెప్పగానే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కళంకారి ప్రింటింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు, స్కిల్ డెవలప్‌మెంట్, బేకరీ, బుక్ బైండింగ్ ఆఫీస్ మేనేజ్‌మెంట్, డ్రైవింగ్ లాంటి నైపుణ్య శిక్షణ, చేతివృత్తుల కార్యక్రమాలు గుర్తుకు వచ్చేవి. నిత్యం వందల మంది యువతులు, మహిళలు ఇక్కడ నిర్వహించే తరగతులకు హాజరయ్యేవారు. వివిధ కోర్సుల్లో తర్ఫీదు పొంది సొంతకాళ్ల మీద నిలబడి, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు. అయితే ఇదంతా గతం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో గ్రామీణ, పట్టణ నిరుపేద యువతులు, మహిళలు ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. అతివల ఆర్థిక భరోసా కోసం ఏర్పాటు చేసిన మహిళా ప్రగతి ప్రాంగణం లక్ష్యానికి దూరమైంది.
'గుంటూరు మహిళా ప్రగతి ప్రాంగణాన్ని 1987లో ఎన్టీఆర్ (NTR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. నాటి నుంచి నిరుద్యోగ మహిళలు, యువతులకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ కోర్సులు ఉచితంగా నిర్వహించారు. 2014 రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం ప్రభుత్వం సైతం ఈ ప్రగతి ప్రాంగణాల్లో వివిధ నైపుణ్య కోర్సులు అందించింది. సంప్రదాయ చేతివృత్తులతో పాటు మహిళలకు ఆటో డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇప్పించింది. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు సైతం శిక్షణా తరగతులు నిర్వహించారు. వేల మంది శిక్షణ పొంది స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు. కుటుంబాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో కొవిడ్‌ను బూచిగా చూపి శిక్షణ కోర్సులను నిలిపేసింది. ఆ తరువాత ఉచిత నైపుణ్య శిక్షణా తరగతులు అందించాలని మహిళలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో నాటి నుంచి నేటివరకు శిక్షణ తరగతుల ఊసే లేదు.' - పరుచూరి కుమారి నందా భారత జాతీయ మహిళా సమాఖ్య సభ్యురాలు
యువతకు నైపుణ్య శిక్షణ - కూటమి ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండనుంది ? - youth skills development
'గతంలో మహిళా ప్రగతి ప్రాంగణంలో తరుణి బ్రాండ్ పేరిట బనియన్లు, మహిళలు, పురుషుల లోదుస్తులను సొంతంగా తయారుచేసి విక్రయించేవారు. నాణ్యత ఉండటంతో పాటు ఇతర బ్రాండ్ల కంటే తక్కువ ధర వల్ల గుంటూరు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో మంచి డిమాండ్ లభించింది. వీటితో పాటు కొవ్వొత్తులు, కుట్లు, అల్లికలు, సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడంతో నిరుద్యోగ మహిళలకు ఆదాయం వచ్చేది. పాదరక్షలు, బేకరి, ఫినాయిల్ యూనిట్లతో పాటు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించడంతో దినసరి వేతనం విధానంలో మహిళా కార్మికులను నియమించి ఉద్యోగావకాశాలు కల్పించారు. వివిధ కోర్సుల్లో తర్ఫీదు పొందిన వేల మంది సూక్ష్మ సంస్థలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందారు. ప్రస్తుతం ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే పని చేస్తోంది. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలో శిక్షణ కోర్సులకు నిధులు విడుదల చేయకపోవడంతో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ కోర్సులు చదివిన మహిళలకు స్వయం ఉపాధి పొందే అవకాశం లేకుండా పోయింది.' -కన్నా రజని, సామాజిక కార్యకర్త
పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మలా సీతారామన్ పర్యటన - డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ సందర్శన
CM Jagan Neglect on Skill Training for Women : మహిళా ప్రగతి ప్రాంగణంలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి బిజినెస్ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, దానిని కూడా మూసివేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో అతివలకు ఉచిత నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్రాంగణం ఇంఛార్జి మేనేజర్ కృష్ణవేణి చర్యలు చేపట్టారు. గతంలో మాదిరి మహిళలకు ఉపాధికి ఉపయుక్తంగా డిమాండ్ ఉన్న కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టైలరింగ్, బ్యుటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణా తరగతుల నిర్వహణకు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు కృష్ణవేణి చెప్పారు.
గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ పాలకుల నిర్లక్ష్యంతో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడినట్లు గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతులు, మహిళలు వాపోయారు. కూటమి ప్రభుత్వం మహిళా ప్రగతి ప్రాంగణాలపై దృష్టి సారించడంతో తమ పరిస్థితిలో మార్పు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.