YSRCP Government In Adani Case : వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యూయార్క్‌లో అవినీతి కేసు నమోదైంది. భారత్‌లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇందులో భాగంగా సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో జగన్ సర్కారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు రూ.2029 కోట్ల లంచాలు ఇచినట్లు అదానీ గ్రూప్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలున్నాయి. 2019-24 మధ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు రూ.1750 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకు రూ.279 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్‌తో భేటీ అయ్యారు. జగన్‌తో అదానీ భేటీ తర్వాత డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు ఉన్నాయి.
అమెరికా ఆరోపణల ఎఫెక్ట్- భారీ నష్టాల్లో అదానీ కంపెనీల స్టాక్స్- రూ.2.45 లక్షల కోట్లు ఆవిరి
అదానీ స్కామ్‌లో జగన్ సర్కారు పేరు : సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ)తో జరిగిన ఒప్పందం స్కామ్‌లో జగన్ సర్కారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు 228 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1750కోట్లు) లంచాలను పుచ్చుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది. ఈ స్కామ్ మొత్తం 2019-24 మధ్య చోటు చేసుకోగా ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభియోగాల ప్రకారం 2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. నాడు విద్యుత్తు సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. అదే సమయంలో 7,000 మెగావాట్‌ల కొనుగోలు డీల్ కుదరడానికి ‘అవసరమైన ప్రతిపాదనలు’ ముందుకొచ్చినట్లు ఆరోపణల్లో పేర్కొన్నారు. 2019-24 మధ్య పని చేసిన ఓ అత్యున్నత స్థాయి వ్యక్తి హస్తం ఉన్నట్లు ఈ అభియోగాల్లో ప్రస్తావించారు.
అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి : రాహుల్ గాంధీ
అదానీ గ్రూప్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదానీ, ప్రధాని నరేంద్రమోదీ బంధాన్ని బయటపెట్టాలని దుయ్యబట్టింది. దీనిపై స్పందించిన బీజేపీ ఈ విమర్శలను తిప్పికొట్టింది. ‘‘అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణల ప్రకారం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)కు 12 గిగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలతో SECI ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోకి వచ్చింది. అయితే, విద్యుత్ సరఫరా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి రాష్ట్రాల కంపెనీలు కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు. దీంతో అదానీ గ్రూప్ 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 265 మిలియన్ డాలర్లు ముట్టజెప్పింది. ఆ సమయంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజీపీయేతర ప్రభుత్వం ఉంది. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ లంచాలకు సమాధానం చెప్పాలి’’ అని బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ దుయ్యబట్టారు.
కాగా భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది.
'అదానీపై వ్యవహారంపై వందల ప్రశ్నలకు సమాధానాలేవీ' - కాంగ్రెస్ తీవ్ర స్పందన - జేపీసీ కోసం డిమాండ్