NO Skill Universities in YSRCP Government : రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని దానికి అనుబంధంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ 16న సమీక్షలో సీఎం జగన్ నిర్దేశించారు. ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన వారికి ఈ వర్సిటీ, స్కిల్ సెంటర్లు అండగా ఉంటాయని అక్కడ మంచి సదుపాయాలు కల్పించి, బోధకులను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఐదేళ్ల పాలనలో నైపుణ్య వర్సిటీలనే ఏర్పాటు చేయలేకపోయారు. కళాశాలలకు భవనాలు నిర్మించలేక ఖాళీగా ఉన్న భవనాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. యువతకు శిక్షణ పెంచకపోగా మరోవైపు ఉన్న కేంద్రాలను మూసేశారు. చివరికి ఏవో దొంగ లెక్కలు రాసి, లక్షల మందికి ఇచ్చినట్లు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Skill Universities in AP : నైపుణ్య కళాశాలల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణంటూ నిరుద్యోగ యువతకు సీఎం జగన్ అరచేతిలో వైకుంఠం చూపారు. మన యువత ప్రపంచంతో పోటీ పడాలంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇంజినీరింగ్ చేసే యువతకు విశాఖపట్నంలో ఉన్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయం, తిరుపతిలో మరో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి, చివరికి అటకెక్కించారు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25, అయిదు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 30 నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి ట్రిపుల్ ఐటీల్లో ఏర్పాటు చేయాల్సిన నాలుగింటిని మూలన పడేశారు.
CM Jagan Rush for Skill Universities: 30 నైపుణ్య కళాశాలలంటూ జగన్ ప్రకటనలు.. 30శాతం యువత ఆశలపై నీళ్లు
మిగతా వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవనాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ఒక్కో కళాశాల భవన నిర్మాణానికి 20కోట్లు చొప్పున 580కోట్లు కేటాయించలేక చేతులెత్తేశారు. కళాశాలల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకూ జగన్ సర్కార్‌కు మనసు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana) కింద ఇస్తున్న నిధులతో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల్లో శిక్షణకు యువత ఆసక్తి చూపడం లేదంటే దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలు మొదలే కాని వర్సిటీలు, మొక్కుబడిగా సాగుతున్న కళాశాలల్లో కోర్సుల అమలు పేరుతో జగన్ సర్కారు ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ఒక్కటీ అమల్లోకి రాలేదు. కేంద్రం ఇస్తున్న నిధుల కోసం డీడీయూజీకేవై కోర్సులనే అమలు చేస్తున్నారు. 120 కోర్సుల్లో అంతర్జాతీయ స్థాయిలో బోధన, శిక్షణ ఇస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు తూతూమంత్రంగా సాగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఏటా 2 లక్షల 30 వేల మంది డిగ్రీ ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో 40శాతంలోపు మందికే ఉద్యోగాలు వస్తున్నాయి.ఈ లెక్కన ఏటా లక్షా 38వేల మందికి నైపుణ్య శిక్షణ అవసరం. కానీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న 26 నైపుణ్య కళాశాలల్లో ఏటా గరిష్ఠంగా 6 వేల240మందికే శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే మిగతా వారు సొంతంగా డబ్బులు వెచ్చించి శిక్షణ పొందాల్సిందే.
స్కిల్ సెంటర్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్ - అనంతరం వెబ్సైట్ ఆవిష్కరణ
నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున 2019 నవంబరులో హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కానీ, వర్సిటీ ఏర్పాటు జరగలేదు. తాజాగా నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్, అధికారులు, ఈడీలు ఒడిశా, హరియాణా తదితర ప్రాంతాల్లో మరోసారి పర్యటించారు. ఇలా పర్యటనల పేరుతో లక్షలు ఖర్చు చేయడం తప్ప వర్సిటీల ఏర్పాటుకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. విశ్వవిద్యాలయాలు, నైపుణ్య కళాశాలల నిర్మాణాలకు ప్రభుత్వం డిజైన్లు రూపొందించినా వాటి నిర్మాణాలు చేపట్టేందుకు గుత్తేదార్లు ముందుకు రాలేదు.
మూడు పర్యాయాలు టెండర్లు పిలిచినా ప్రభుత్వం నిధులిస్తుందనే నమ్మకం లేకపోవడంతో అటువైపే చూడలేదు. ఓ ఉన్నతాధికారి ప్రత్యేకించి పిలిచి గుత్తేదారులతో మాట్లాడినా, స్పందనలేకపోవడంతో, చివరికి టెండర్లను రద్దు చేసి, నిర్మాణాలను అటకెక్కించారు. నైపుణ్య శిక్షణను మూలన పడేయడంతో విమర్శలు పెరిగాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా సొంత భవనాలు లేకుండానే 2022 అక్టోబరులో మొదట మూడు నైపుణ్య కళాశాలలను ప్రారంభించారు. వీటిని పాలిటెక్నిక్‌లు, విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏర్పాటు చేసి మొక్కుబడి శిక్షణను నిర్వహిస్తున్నారు.
తిరుపతి సమీపంలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నాలుగున్నరేళ్ల క్రితం 50 ఎకరాలను జగన్ సర్కార్ కేటాయించింది. ఇక్కడ వర్సిటీ ఏర్పాటు చేయకపోగా దీని చుట్టూ స్థిరాస్తి వ్యాపారం చేసి, వైసీపీ నాయకులు కోట్లు సంపాదించుకున్నారు. విశాఖపట్నం హై ఎండ్ వర్సిటీకి ఇంతవరకు స్థలాన్నే పరిశీలించలేదు. టీడీపీ ప్రభుత్వం హయాంలో హెచ్‌సీఎల్‌తో కలిసి ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. స్థలం ఎంపిక పూర్తయింది. వైకాపా ప్రభుత్వం రాగానే దాన్ని మూలకు పడేసింది.
జగన్ సర్కార్ ఈ ఐదేళ్లలో లక్షా 22 వేల మందికి శిక్షణ ఇస్తే 44,946 మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. కానీ, గత రెండేళ్లల్లోనే 3లక్షలకుపైగా యువతకు శిక్షణ ఇచ్చినట్లు లక్షకుపైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేస్తోంది. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రాంగణ నియామకాలు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఉద్యోగాలను ప్రభుత్వం జాబితాలో కలిపేసి, సంఖ్యను పెంచి చూపుతోంది.
ఏటా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందుతున్న వారే 2 లక్షల 30 వేల మంది ఉంటే 2022-23, 2023-24లో 3లక్షల మందికి శిక్షణ ఇచ్చారట. విచిత్రమేమిటంటే 2023-24 విద్యా సంవత్సరం ఇంతవరకు పూర్తి కాలేదు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్న స్కిల్ హబ్‌లు, కళాశాలల్లో చేరేందుకే అభ్యర్థులు రావడం లేదు. రాష్ట్రంలో 26 నైపుణ్య కళాశాలల్లో కలిపి ఇప్పటివరకు 2 వేల 835మందికి శిక్షణ ఇస్తే వీరిలో అధికారిక గణాంకాల ప్రకారం 2 వేల 219 మంది ఉద్యోగాలు పొందారు. న్యాక్ శిక్షణ కేంద్రాలతోపాటు 192 స్కిల్ హబ్స్‌లో 34 వేల 900మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 21 వేల 200 మందికి మాత్రమే ఉపాధి లభించింది.