YSRCP Government Destroyed Mangroves in Kakinada District : పేదలకు ఇళ్ల ముసుగులో కాకినాడలో వైఎస్సార్సీపీ నాయకులు చేసిన పర్యావరణ విధ్వంసకాండ కొన్ని వందల మంది మత్స్యకారుల కడుపుకొట్టింది. ఏకంగా 58 ఎకరాల్లో మడ అడవుల్ని నరికేయడంతో మత్స్యకారుల ఉపాధికి గండి పడింది. మడ వనాల్ని పునరుద్ధరించాలని ఎన్జీటీ ఆదేశించినా ప్రభుత్వం ఆ పనులు చేయించకుండా ఏవోవే సాకులు చెప్తోంది.
Dummulapeta Kakinada District : కాకినాడ దుమ్ములపేట సమీపంలో 90 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఏటా జలచరాల వేటకు విరామం ప్రకటించే సమయంలో మత్స్యకారులు మడ అడవుల్లోనే చిన్నచిన్న చేపలు పట్టుకుని జీవనోపాధి సాగిస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే, వైఎస్సార్సీపీ నాయకులు మడ అడవుల్ని ఇలా మట్టిదిబ్బలుగా మార్చేశారు! పేదల ఇళ్ల స్థలాల పేరిట 58 ఎకరాల్లో మెరక పనులు చేయించి లేఔట్ వేయించారు. మడ అడవుల్ని నాశనం చేస్తే 54 వేల మంది జీవనోపాధికి విఘాతమని అప్పట్లో మొత్తుకున్నా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లెక్కపెట్టకుండా, నాశనం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు.
ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ- 'అవినీతి అధికారులపై చర్యలు తప్పవు'
NGT Urged to govt Stop Destroying Mangrove : మడ అడవుల విధ్వంసంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా మండిపడింది. ధ్వంసం చేసిన మడ వనాన్ని పునరుద్ధరించాలని స్పష్టంచేసింది. ఐతే, 10 వేల మొక్కలు పైపైన నాటి వాటికి కొన్నాళ్లపాటు నీరు పోసినట్టు అధికారులు మమ అనిపించారు. నిధులు వృథా చేశారే తప్ప, ఆ మొక్కలు బతకలేదు. పూడ్చిన మట్టిని పూర్తిగా తొలగిస్తేనే మడ అడవులు జీవం పోసుకుంటాయని గతేడాది మే 24నే ఎన్జీటీ నిపుణుల బృదం నివేదిక ఇచ్చింది. ఐనా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కదలిక రాలేదు.
కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలి - అధికారులకు కలెక్టర్ సూచన
మడ అడవులుండాల్సిన చోట ప్రస్తుతం ముళ్ల కంప, పిచ్చి మొక్కలు మొలిచాయి. మడ మొక్కలు బతకాలంటే 1.2 మీటర్ల ఎత్తున పోసిన 3 లక్షల10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్‌ను తొలగించాలి. ఈ పనులకు ఫిబ్రవరి 9న ఒకసారి, ఏప్రిల్ 6న మరోసారి వేలం నిర్వహిస్తామన్నా ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా ఎన్నికల హడావుడిలో యంత్రాంగం నిమగ్నం అవ్వడంతో మడ వ్యవహారం పక్కకుపోయింది! మత్స్యకారుల జీవనోపాధి గాలిలో దీపంలా మారింది.
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలో భారీ పేలుళ్లు - హడలిపోతున్న గ్రామస్థులు