YSRCP Former MLA Meka Pratap Apparao Irregularities : ఏలూరు జిల్లా నూజివీడులో గత ఐదేళ్లు అధికారం అండతో మేకా వెంకట ప్రతాప అప్పారావు, ఆయన పుత్రుడు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నూజివీడుకు చెందిన రామ్మోహన అప్పారావుకు పట్టణ శివారులోని గొడుగుగూడెంలో 29.5 ఎకరాల భూమి ఉంది. 1970లో ఇనుగంటి రామచంద్రారావుకు ఆ భూమిని అమ్మారు. రామచంద్రరావు బ్రహ్మచారి కావడంతో తదనంతరం ఆయన సోదరుడు నరసింహారావుకు ఆ భూమి సంక్రమించింది.
1985లో నూజివీడుకు చెందిన పలువురు రైతులకు ఆయన ఆ భూమిని విక్రయించగా అప్పటి నుంచి 2017 వరకు వారే ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. వారి పేరు మీదే పట్టాదారు పాసు పుస్తకాలు, 1బీ, అడంగల్ లాంటి అన్ని హక్కులూ ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే కన్ను ఆ భూమిపై పడింది. తన సోదరికి ఆ భూమి కట్టబెట్టాలని ఆయన పావులు కదిపారు. రామ్మోహన అప్పారావు భూమిని సోదరి పేరున నకిలీ వీలునామా సృష్టించి రికార్డులు మార్చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల పేరుమీద ఉన్న పాసు పుస్తకాలు, 1బీ, అడంగల్ అన్నీ రద్దు చేశారు. మేకా వెంకట ప్రతాప అప్పారావు సోదరి పేరు మీద రికార్డులు సృష్టించి ఈ భూమి తమదేనంటూ బెదిరింపులకు గురిచేశారని రైతులు వాపోతున్నారు.
ఈ భూముల్లో పామాయిల్, వరి, కొబ్బరి పెంచుకుంటూ జీవిస్తున్న రైతులను పొలంలోకి అడుగు పెట్టకుండా పోలీసులతో పహారా పెట్టించారు. పొలాలు బీడువారిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరిన రైతులపై అక్రమ కేసులు బనాయించారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్ల నుంచి కట్టుబట్టలతో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని బయటకు పంపేశారని, నాలుగేళ్లు అద్దె ఇళ్లలో తలదాచుకున్నామని బాధితులు వాపోతున్నారు.
కష్టపడి సంపాదించుకున్న పొలం చేజారిపోతోందన్న వేదనతో ముగ్గురు రైతులు గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాలుగేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి మానసిక క్షోభకు గురయ్యామని రోదిస్తున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై విచారణ చేయించి రెవెన్యూ రికార్డుల్లో తిగిరి తమ పేర్లు నమోదు చేసేలా అధికారుల్ని ఆదేశించాలని బాధితులు కోరుతున్నారు.
14 మండలాల్లో 15 వేల ఎకరాలు- పెద్దిరెడ్డి కుటుంబ కబ్జాలు - peddireddy family land grabbing