YSRCP Attack on TDP Leaders in Narasaraopet: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని టీడీపీ శ్రేణులపై రాళ్లు, గాజు సీసాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు మండిపడ్డారు.
టీడీపీ సర్పంచ్‌పై వైఎస్సార్సీపీ నేతల దాడి
అరవింద బాబు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో టీడీపీ శ్రేణులతో పర్యటించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ శ్రేణులు టీడీపీ వర్గీయులపై రాళ్లు, సీసాలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ శ్రేణుల దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలపాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
మీడియాపై దాడులు భగ్గుమన్న నిరసనలు - కేంద్రం జోక్యం చేసుకోవాలని నినాదాలు
వార్డులో పర్యటించడానికి వీల్లేదని వైసీపీ శ్రేణులు తమపై దాడి చేశారని వివరించారు. ఈ దాడి ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించిన పనే అని చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. క్రిస్టియన్ పాలెంలో సుమారు నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జా చేశారన్నారు. ఈ వ్యవహారాన్ని తాము వెలుగులోకి తీసుకువచ్చి దానిని అడ్డుకోవడంతో కక్ష కట్టి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులను తమపై ఉసిగొల్పి రాళ్లు, సోడా బాటిళ్లతో దాడి చేయించారని చదలవాడ అరవిందబాబు వెల్లడించారు.
రాష్ట్రాన్నిఅరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చిన వైసీపీ కార్యకర్తలు, నేతలు
టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ నరసరావుపేట టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విగ్రహం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖండించిన చంద్రబాబు : నరసరావుపేటలో తెలుగుదేశం శ్రేణులపై దాడులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్ అరవింద్ బాబు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అధికార పార్టీ హింసకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడి ఆరా తీశారు.