Election Code Violation : సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా వైసీపీ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఇన్ని రోజులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలు తాజాగా లక్ష్మణరేఖలోనే ఉండాలంటే జీర్ణించుకోలేకపోతున్నారు. 'మేము అనుమతులు తీసుకోవడమా' అంటూ బుకాయింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
YSR District : సీఎం జగన్ సొంత జిల్లాలో గత రెండు రోజులుగా ఇష్టారాజ్యంగా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. నిబంధనలు మాకేంటంటూ వైసీపీ నేతలు తాయిలాల పంపిణీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో వరుసగా మూడురోజులు (సోమ, మంగళ, బుధవారం) కేసులు నమోదు కావడం గమనార్హం.
ఈసీ ఆదేశాలు పట్టించుకోని వాలంటీర్లు- యథేచ్ఛగా వైఎస్సార్సీపీకి ప్రచారం
YCP Leaders Election Campaign : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా మంగళవారం 38వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో అనుమతి లేకపోవడంతో ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని ఎన్నికల అధికారుల బృందం చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రచారం నిర్వహణకు ఈసీ సూచించిన సువిధ యాప్ లేదంటే ఎన్నికల అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి గానీ పొందాల్సి ఉంది. కానీ ఇవేమి చేయకుండా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించడంతో అధికారులు నిలిపివేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారం చేయడంతో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 38వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రమాదేవితో పాటు ఆమె తనయుడు సురేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తాజా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేరు చేర్చారు.
ఎమ్మెల్యే అనుచరుల అరాచకం - నిలబడి గౌరవం ఇవ్వలేదని యువకులపై దాడి
Election Code : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరవాత కూడా అనుమతి లేకుండా ప్రచారాలు చేయడం, ఓటర్లు ప్రలోభాలు పెట్టేలా తాయిలాలు పంపిణీ చేయడం లాంటి వంటివి ఎమ్మెల్యే రాచమల్లు శ్రీకారం చుట్టారు. ఈనెల 17న ప్రొద్దుటూరులో నిర్వహించిన దూదేకుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు పాల్గొని ప్రసంగించారు. అదే సమావేశానికి వచ్చిన మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి టోకెన్లు ఇచ్చారు. రాచమల్లు ప్రచారం మీడియాలో ప్రసారం కావడంతో జిల్లా కలెక్టర్ విజయరామరాజు విచారణకు ఆదేశించారు. ఫలితంగా వైసీపీ నాయకులు దస్తగిరి, నాగూర్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నప్పటికీ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్- నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మీనా
Maidukuru Constituency : మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అనుమతి లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం కోడ్ ఉల్లంఘనల కిందకే వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలుగుదేశం నేత రెడ్యెం వెంకటసుబ్బారెడ్డి వైసీపీలోకి చేరడానికి మైదుకూరులో సభ ఏర్పాటు చేయగా అవినాష్‌రెడ్డి, రఘురామిరెడ్డి హాజరయ్యారు. కానీ రెడ్యెం వెంకటసుబ్బారెడ్డి తన స్వగ్రామమైన దుంపలగుట్టు నుంచి మైదుకూరు వరకు వాహనాలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా సభకు చేరుకున్నారు. కానీ ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైదుకూరుకు చెందిన తెలుగుదేశం నేతలు ఎన్నికల సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు భారీ ర్యాలీ చేసిన వీడియో కూడా యాప్‌లో పోస్టు చేశారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్ జిల్లా ముద్దనూరు యాదవ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.60 లక్షలతో రామాలయ పునర్నిర్మాణానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనకూడదు. ప్రస్తుతం ఎమ్మెల్యే భూమి పూజ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ముద్దనూరు తహసిల్దారును కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం.