YCP leader is writing down tribals rights: ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న ఆ అరాచకానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ అండదండలు అందిస్తున్నారు. అక్కడ ఏ సభ జరిగినా సీఎం ఆ వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. అంతే కాదు, ముఖ్యమంత్రి కార్యాలయంలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. మన్యంలో ఆ గిరిజనేతర నాయకుడు అయిదేళ్లుగా తన ‘అనంత’ బాహువులతో ఆదివాసీలను నలిపేస్తున్నారు. తనను ‘మన్యం డాన్’ గా పిలిపించుకుంటారు. అక్కడ వైసీపీ నుంచి ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా వారిని తన చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలనైనా సరే. ఇన్ని అర్హతలున్నాక పదవి లేకపోతే ఏం బావుంటందని ఆ పార్టీ ముఖ్యనేత తలచారో ఏమో, ఎమ్మెల్సీగా నియమించారు.
ప్రజాప్రతినిధులూ కీలుబొమ్మలే: 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళా నాయకురాలిని నామమాత్రం చేసి అధికారాన్ని చెలాయించేవారు. ఆమె ఏటీఎం కార్డును తనవద్దే పెట్టుకుని ఆమెకు చెల్లించే జీతభత్యాలను ఆయనే తీసుకొనేవారు. ఆ నేత ఆగడాలు, దౌర్జన్యాలతో మనస్తాపం చెందిన ఆమె 2017లో టీడీపీ చేరిపోయారు. 2019 ఎన్నికల్లో మరో మహిళా టీచరును ఈ వ్యక్తి తెరపైకి తెచ్చారు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక వెనక నుంచి తానే చక్రం తిప్పారు. ఆమె నిత్యం తన కనుసన్నల్లోనే ఉండాలని, ఈ ప్రాంత ముఖ్యకేంద్రంలో కాకుండా తన ఇంటి ఎదుటే ఆ ప్రజాప్రతినిధి నివాసమూ ఏర్పాటు చేయించారు.
భయపెట్టి తన మాట వినేలా చేసుకుని: ఈ అరాచక నాయకుడి తండ్రి మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఉండేవారు. ఆ తర్వాత 2002లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వ్యక్తి జడ్పీటీసీగా గెలిచారు. ఆనక ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొంది 2006లో మళ్లీ అదే మండలం నుంచి మండల పరిషత్తు అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆ ఎస్టీ ధ్రువీకరణ పత్రం చెల్లలేదు. ఆదివాసీలకు దక్కాల్సిన మండలాధ్యక్ష పదవినీ ఆయనే అనుభవించారనే ఆగ్రహం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. 2014లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తే ఆ కులధ్రువీకరణ సరైంది కాదని తేల్చి పోటీ నుంచి తప్పించారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు సైతం ఆయనకు చెప్పిన తర్వాతే ఏ పనైనా చేసుకోవాలి లేకుంటే తన అనుచరులతో కేసులు పెట్టించి బెదిరిస్తారు. దాడులకు సైతం దిగుతారు. గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు తీసుకుంటారు.
గిరిజనుల భూములను చెరబట్టేశారు: మొదట్లో ఈయనకు 20ఎకరాల భూమి ఉండేది. బెదిరింపులకు పాల్పడి గిరిజనుల నుంచి కారుచౌకగా వందల ఎకరాల భూములు దక్కించుకున్నారు. మరికొన్ని భూములను ఆక్రమించుకుని బినామీల పేరున పట్టాలను పొంది సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 200 ఎకరాలు ఈయన గుప్పిట్లో ఉన్నాయి. వాటిలో 150 ఎకరాలకు పైగా చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఆ చెరువులకు మద్దిగడ్డ జలాశయం నుంచి ఏడాది పొడవునా నీరుపారేలా కాలువలను తవ్వించారు. ఎటపాక మండలంలో భద్రాచలం రాములవారి భూముల్లో ఈయన అనుచరులు పాగా వేశారు. పోలవరం ప్రాజెక్టు భూములకు సంబంధించి బినామీలను సృష్టించి దొంగ డి-పట్టాలతో రూ. కోట్లలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో ఈయన హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.
మన్యం.. వీరప్పన్!: రంపచోడవరం మన్యంలో బినామీల పేరున క్వారీలను నిర్వహిస్తూ రూ.కోట్లలో గిరిజనులకు చెందాల్సిన ఖనిజ సంపదను ఆ నేతే దోచుకుంటున్నారు. అడ్డతీగల మండలం గొంటువానిపాలెంలో రెండు మెటల్ క్వారీలు, రంపచోడవరం మండలం చుప్పరిపాలెంలో గ్రానైట్ క్వారీతో పాటు నరసాపురంలో మెటల్ క్వారీలను బినామీ(గిరిజనులు)ల పేరున అనుమతులు తీసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. క్వారీల నిర్వహణలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు కొందరికి ముడుపులు ముట్టజెప్పి కొండలను పీల్చి పిప్పిచేస్తున్నారు. మన్యం నుంచి విలువైన కలపను లారీలు, ట్రాక్టర్లతో తరలిస్తూ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు.
కేసులు మాఫీ చేసుకుని: ఆయనపై అడ్డతీగల పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్ ఉండేది. 2016లో ఎంపీగా ఉన్న కొత్తపల్లి గీత ఫొటోని అసభ్యంగా మార్చి బ్యానర్లు ఏర్పాటు చేశారు. సదరు నేతపై ఆమె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, తర్వాత బెయిల్‌పై వచ్చారు. ఉద్యోగులపై దౌర్జన్యాలకు పాల్పడంతో అప్పట్లో 18 కేసులు ఆయనపై నమోదయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రౌడీషీట్‌ను తొలగించుకున్నారు. మరికొన్ని కేసులను సైతం మాఫీ చేయించుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయనపై ఉన్నట్లు సమాచారం. తన వాహనాలకు అడ్డంగా వచ్చారని ఆర్టీసీ డ్రైవర్లని సైతం తన అనుచరలతో కొట్టించారు.
దళితులు తరిమి కొట్టారు: ఈ అరాచక వ్యక్తిపై జనాగ్రహమూ పెల్లుబికుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరం వచ్చారీ ప్రజాప్రతినిధి. ఆపై అంబేడ్కర్ విగ్రహానికి దండ వేశారు. ‘దళితుడిని చంపి డోర్‌డెలివరీ చేసిన నువ్వు అంబేడ్కర్‌కు దండ వేస్తావా’ అంటూ ఆ ఊరి దళితులంతా అక్కడికి వెళ్లి ఆయన్ని నిలదీశారు. వెంటనే ఊళ్లోంచి వెళ్లిపోవాలంటూ వాహనాన్ని చుట్టుముట్టడంతో అక్కడ నుంచి ఉడాయించారాయన. తాజాగా పోలవరం ముంపు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లగా, ‘ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు గుర్తొచ్చామా’ అంటూ స్థానికులు నిరసన తెలిపారు.
దళితుడ్ని చంపి దండేస్తే ఊరుకుంటామా?- అనంతబాబుపై దండెత్తిన దళితులు - Protest Against MLC Ananthababu