YS Sunitha Fire Cm Jagan : ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని పదేపదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. వైఎస్ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని గుర్తు చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ప్రజలంతా గ్రహిస్తున్నారని, వాస్తవాలేంటో వారికి తెలుసని అన్నారు. హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్‌కు సునీత మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఎమోషన్ మాటలతో ప్రతిసారీ అందర్నీ మోసం చేయలేరని ఎద్దేవా చేశారు.
సాక్షి ఛానల్‌కు వస్తా - డిబేట్ చేద్దాం : వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలని సునీత డిమాండ్ చేశారు. వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసనిజగన్ అన్నారని సునీత గుర్తు చేశారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో జగన్ కూడా ఒకరు కదా! అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో ఎవరు చేయించారో జగన్‌కు తెలిసినట్లే కదా! అని అన్నారు. అది ఎందుకు బయటపెట్టడం లేదని తెలిపారు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా జగన్‌పై ఉందని అన్నారు.
జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case
అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. అవినాష్‌ను అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా? అంటూ ప్రశ్నించారు. జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థంచేసుకోవాలని, తనతో నేరుగా మాట్లాడాలంటే సాక్షి ఛానల్‌కే వస్తా ధైర్యంగా మాట్లాడదామని ఛాలెంజ్ చేశారు. తనకు అభ్యంతరం లేదని సాక్షి ఛానల్‌కు తానే వస్తానని, డిబేట్ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం రక్తంతో తడిసిపోయింది : ఐదేళ్లలో ఒక్కసారి తప్ప జగన్ వివేకా హత్యపై ఎప్పుడూ మాట్లాడలేదని సునీత గుర్తు చేశారు. ఆ ఒక్కసారి కూడా అవినాష్‌ను కాపాడేందుకే మాట్లాడారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే హత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వం రక్తంతో తడిసిపోయిందని, నేనెప్పుడూ రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జగన్‌ను కోరుతున్నానని అన్నారు. రెండేళ్ల క్రితం పులివెందులలో తనపై కేసు పెట్టారని, తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తున్నామని పెట్టిన కేసు ఇటీవల ఎఫ్‌ఐఆర్ చేశారని గుర్తు చేశారు. ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని కోర్టుకు వచ్చానని అన్నారు.
హంతకుల పార్టీకి ఓటేయొద్దు- జగనన్న పార్టీ గెలవొద్దు: వైఎస్ సునీత
చివరి అరగంట భయపడ్డాను : వివేకం సినిమాను చాలా ధైర్యంగా రూపొందించారని సునీత తెలిపారు. సినిమా చివరి అరగంట చూసేందుకు తాను భయపడ్డానని, వివేకం సినిమాలో చూపిన దానికంటే వాస్తవం ఇంకా భయంకరంగా ఉందని అన్నారు.
వివేకాను అందుకే చంపేశారా? : కడప ఎంపీగా షర్మిల పోటీచేయబోతున్నారని తెలిసిందని, ఆమెకు శుభాకాంక్షలు సునీత తెలిపారు. సంఘీభావం చెబుదామంటే కూడా చెప్పలేని పరిస్థితి అని అన్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిల కష్టపడి ఎన్నికల ప్రచారం చేసి గెలిపించిందని గుర్తు చేశారు. కష్టపడి పనిచేసి గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయపడ్డారని, తనకంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ భయపడ్డారని తెలిపారు. షర్మిలను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని ఆనాడు వివేకా అనుకున్నారని అన్నారు. షర్మిలకు మద్దతు కూడా లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా? అని ప్రశ్నించారు.