YS JAGAN LETTER TO ASSEMBLY SPEAKER: అసెంబ్లీలో వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శాసనసభాపతికి వైఎస్ జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు.
కూటమి, స్పీకర్ శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు: పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేస్తున్నానన్నారు.
1984లో లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుందని, సభలో 10 శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని తెలిపారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించిందని, 10 శాతం సీట్లు కాంగ్రెస్కు లేకపోయినప్పటికీ పి.జనార్దన్రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని తెలిపారు.
2015లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 శాతం ఓట్లను సాధించిందని, ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన తమపై ఉందన్నారు. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుందని, దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారన్నారు.
సభాకార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది కానీ, వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదన్నారు. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నట్లు జగన్ తెలిపారు.
Minister Sandhya Rani on YS Jagan Letter: ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ మాజీ సీఎం జగన్ లేఖపై మంత్రి సంధ్యా రాణి స్పందించారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదాను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అసలు శాసన సభ అంటే గౌరవం లేదని విమర్శించారు. తన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా సభలో కూర్చోని వ్యక్తి జగన్ ఒక్కరేనేమోనని ఎద్దేవా చేశారు.
ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కొందరు ఇతర పదాలు తప్పుగా మాట్లాడతారు. కానీ జగన్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన పేరే మర్చిపోయారన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరన్నారు. తాము పిలిచినా మాజీ సీఎం స్పీకర్ కు గౌరవం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు. మహిళలను గత ప్రభుత్వం ఎంతలా ఏడిపించిందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు.