Young Woman Yoga Poses in Swimming Pool: సాధారణంగా నీటిలో ఎంతసేపు ఉండగలం? 2 గంటలు, మహా అయితే 3 గంటలు. ఈతలో ఎంతో నైపుణ్యం ఉన్న వారు కూడా స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువ సేపు ఉంటే ఊపిరాడదు. కానీ ఆ యువతి మాత్రం ఏకధాటిగా 22 గంటలు నీటిలోనే ఉండగలదు. జలకన్యలా శరీరాన్ని విభిన్న ఆకృతుల్లోనూ తిప్పగలదు. స్విమ్మింగ్‌పూల్‌లో యోగాసనాలు వేస్తూ ఔరా అనిపిస్తోంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాదు ఏకంగా దేశస్థాయిలోనూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.
స్విమ్మింగ్‌పూల్‌లో చేప పిల్లలా ఎంతో వేగంగా ఈత కొడుతూ యోగాసనాలు వేస్తున్న ఈ అమ్మాయి పేరు సాహితి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటకు చెందిన సర్వేశ్వరరావు, నాగజ్యోతి దంపతుల కుమార్తె. బీటెక్ చదువుతున్న సాహితికి స్విమ్మింగ్ అంటే మహా ఇష్టం. కుమార్తె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు సాహితి ఆరో ఏట నుంచే ఈతలో శిక్షణ ఇప్పించారు.
మిర్రర్ రైటింగ్లో విశాఖ యువతి పతకాల పంట- 134 భాషల్లో 'వందేమాతరం' - Woman Excels in Mirror Writing
అంతేకాదు సాహితికి యోగాసనాలు వేయడం కూడా వచ్చు. ఈ క్రమంలోనే ఈతకొలనులో యోగాసనాలు ఎందుకు వేయకూడదు అనే ఆలోచన తట్టింది. పట్టుబట్టి మరీ తల్లిదండ్రులను ఒప్పించి అందులోనూ తర్ఫీదు తీసుకుంది. ఈతలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో రకరకాల జల విన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తోంది.
పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు నర్సీపట్నంలో ఓ ప్రైవేటు రిసార్ట్‌లో జల విన్యాసాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈత కొలనులో యోగాసనాలు వేసిన సాహితిని అక్కడకి వచ్చిన వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కేరింతలు కొడుతూ సాహితిని అభినందించారు.
విభిన్న ప్రతిభతో దూసుకెళ్తున్న సాహితిని ఇప్పటికే 32 అవార్డులు వరించాయి. 2019లో ప్రాణాలను పణంగా పెట్టి రేవు పోలవరం బీచ్‌లో మునిగిపోతున్న ఇద్దరు పిల్లల్ని కాపాడింది. ఇందుకుగానూ సాహితిని సాహస బాలికగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తమ జీవన్ రక్ష అవార్డుతో సత్కరించింది. భవిష్యత్తులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనేదే తన ఆశయమని సాహితి అంటోంది.
"నాకు స్విమ్మింగ్ చాలా ఇష్టం. ఆరో ఏట నుంచే ఈతలో శిక్షణ తీసుకుంటున్నాను. దీంతోపాటు నాకు యోగాసనాలు కూడా వేయటం వచ్చు. ఈతకొలనులో యోగాసనాలు ఎందుకు వేయకూడదు అనే ఆలోచన తట్టింది. పట్టుబట్టి మరీ తల్లిదండ్రులను ఒప్పించి అందులోనూ తర్ఫీదు తీసుకున్నాను. భవిష్యత్తులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనేదే నా ఆశయం." - సాహితి, స్విమ్మర్