Woman Jumped into the Canal in AP : ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయం కాగా అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ యువతి ప్రేమికుడి కోసం పరితపించి ఇంట్లో వాళ్లను కాదని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి విశ్వప్రయత్నాలు చేసింది. అయినా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చివరకు కాలువలో దూకింది. ఏపీలోని కృష్ణా జిల్లాలోని చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఇంటి వద్దే ఉంటున్న ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు.
ఈ నేపథ్యంలో ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు దానికి అంగీకరించలేదు. దీంతో ఆమె నవంబర్ 24న కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. నవంబర్ 25న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా యువతి ఇంటి నుంచి పారిపోయింది. కుటుంబసభ్యులు వెతకగా, తునిలో ఉన్నట్లు గుర్తించి, ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. మళ్లీ నవంబర్ 26న రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోగా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
యువతి కాలువలోకి దూకినట్లు ఫోన్ : దీంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో ఈ నెల 27న యువతి తండ్రికి పాండు అనే వ్యక్తి ఫోన్ చేశారు. పాత పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో వారి కుమార్తె పైవంతెన నుంచి రైవస్ కాలువలోకి దూకినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో మహిళ కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ వేదికగా ఇన్‌స్టాగ్రామ్ : సోషల్ మీడియాను కొందరు సమాచారం కోసమో, వినోదం కోసమో వాడితే, మరికొందరు వాటిని ప్రేమకు వేదికలుగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి ఎవరో, ఏం చేస్తారో అని సమగ్ర సమాచారం తెలుసుకోకుండా తొలుత స్నేహం చేస్తున్నారు. అది కాస్తా ప్రేమగా మారుతోంది. ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా ఎక్కడో ఓ చోట ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలకు బలైపోతూనే ఉన్నారు.