YCP Leaders Attacked on Person for not Coming to Jagan Meeting: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీ నేతల దాడులు ఆగట్లేదు. సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభకు రావాలని వైసీపీ నేతల దౌర్జన్యం చేస్తున్నారు. సభకు రాలేనని చెప్పినందుకు వైసీపీ నేతలు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఆచ్చమ్మకుంట తండాలో టీడీపీ సానుభూతిపరునిపై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. గ్రామానికి చెందిన బానవత్ ఛత్రియా నాయక్ వద్దకు అదే గ్రామానికి చెందిన సమీప బంధువు, వైసీపీకి చెందిన వాలంటీర్ రమేష్ నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ శరవన్ నాయక్, నరేష్ నాయక్‌లు పిడుగురాళ్లలో జరిగే సిద్ధం సభకు రావాలని అడిగారు. తాను ఏ పార్టీ కార్యక్రమాలకు రావటం లేదని చెప్పాడు. దీంతో మా పథకాలు తీసుకున్నావు కదా, ఎందుకు రావు అంటూ ఛత్రియా నాయక్‌పై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ బాధితుడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి ఘటన తెలుసుకున్న టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.