Advocate Died At Police Station In Ananthapur District: కేసు విచారణ చేస్తున్న సమయంలో ఒత్తిడి భరించలేక ఓ న్యాయవాది పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో మృతి చెందాడు. అయితే పోలీసులు అతన్ని విచారణ చేస్తున్న సమయంలో గుండెపోటుతో న్యాయవాది ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన అనంతపురం నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.
పంచాయితీలో ప్రాణాలు పోయాయి: అనంతపురం నగరంలోని మూడో పట్టణ రోడ్డుకు చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి (58)కి, అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో సివిల్ వివాదం ఉంది. అయితే దీనిపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం మూడో పట్టణ పోలీసులు ఆయన్ను పిలిపించారు. న్యాయవాదితోపాటు మరో న్యాయవాది రాము కూడా వెళ్లారు. న్యాయవాది తన వద్దనున్న కోర్టు కాపీలను సీఐకి అందించారు. సీఐ వాటిని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా న్యాయవాది కుర్చీలో నుంచి వెనక్కి వాలి కుప్పకూలారు.
అప్రమత్తమైన సీఐ, పక్కన ఉన్న మరో న్యాయవాది, కానిస్టేబుళ్లు అతన్ని చికిత్స కోసం హుటాహుటిన ఆటోలో తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు కొన్నిరోజులుగా గుండె సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నారని సమాచారం. అయితే సివిల్ వ్యవహారాల్లో సీఐ తలదూర్చి పదే పదే ఫోన్‌చేసి పిలిపించి గట్టిగా మందలించారని, సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురిచేయడం కారణంగానే గుండెపోటుతో మృతి చెందారని జిల్లా న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
వివాదస్పదమైన న్యాయవాద మృతి: అనంతపురంలో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న శేషాద్రి ఓ ఇంటి విషయంలో మహిళతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ మహిళ జిల్లా ఎస్పీని గ్రీవెన్స్ లో ఆశ్రయించింది. గ్రీవెన్స్ నిమిత్తం విచారణకు మూడో పట్టణ పోలీసులు శేషాద్రిని పిలిపించారు. ఈ నేపథ్యంలో శేషాద్రి గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. పోలీసుల వేధింపుల వల్లే శేషాద్రి మృతి చెందాడని తోటి న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గతంలోనూ శేషాద్రికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ దీనిపై న్యాయవాదులంతా పోలీసుల వల్లే ఈ దారుణం జరిగిందని ఆందోళనను చేపట్టారు.