Student Meet Teacher After 63 Years: ప్రస్తుత రోజుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కాపాడిన వ్యక్తినే మరిచిపోతున్నారు. కానీ ఓ విద్యార్థి మాత్రం తనకి విద్యాబుద్ధులు నేర్పిన గురువు కోసం ఏకంగా 63 సంవత్సరాలు అన్వేషించాడు అంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు? గురువు కోసం 63 సంవత్సరాలు ఎందుకు నిరీక్షించాడు. కలిసిన తరువాత ఏం చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
గురు, శిష్యుల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ, హృదయాన్ని హత్తుకునే ఈ సంఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్.గొల్లపల్లిలో జయరాం వడియార్ అనే వ్యక్తి 1960-62 మధ్య కాలంలో టీచర్‌గా పనిచేశారు. అయితే తరువాత ఆయన అక్కడ నుంచి బదిలీ అయి, పలుచోట్ల విధులు నిర్వహించారు. అనంతరం ఉద్యోగ విరమణ తరువాత ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం కూచువారిపల్లెలో తన విశ్రాంత జీవితాన్ని గడుపుతూ ఇక్కడే స్థిరపడ్డారు.
ఈ ఉపాధ్యాయుడి దగ్గర కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ విద్యార్థి విద్యని అభ్యసించాడు. అతడి పేరే గంటలప్ప. గొల్లపల్లిలో రెండు సంవత్సరాల పాటు ఆయన దగ్గర చిన్నతనంలో గంటలప్ప విద్యని అభ్యసించాడు. చిన్నతనంలోనే తనపై ఎంతో ప్రభావం చూపి, విద్యాబుద్ధులను నేర్పిన ఆ గురువును ఎలా అయినా కలవాలని ఎంతగానో ప్రయత్నించాడు గంటలప్ప.
ఎన్నేళ్లు అయినా కూడా పట్టువదలకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నిస్తూనే వచ్చాడు. ఎట్టకేలకు తన 63 ఏళ్ల కలను నెరవేర్చుకున్నాడు ఆ విద్యార్థి. 6 దశాబ్దాల నిరీక్షణకు ఆదివారంతో తెరపడింది. ఆదివారం సాయంత్రం తన మనవడు యతీష్‌తో కలిసి గురువుని కలిశారు. గురువుని చూసిన వెంటనే మరోసారి గంటలప్ప తన చిన్నతనానికి వెళ్లిపోయాడు.
గురువుని చూసిన వెంటనే ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. గురుశిష్యులు కలిసి సరదాగా కాసేపు పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఎప్పటికీ చదువు చెప్పిన గురువును మరవరాదు అంటూ తన మనవడికి సైతం గంటలప్ప హితవు పలికారు. 63 సంవత్సరాల తరువాత గురువును వెతుక్కుంటూ వచ్చిన శిష్యుడిని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోతూ గంటలప్పను అభినందించారు.
'మమ్మల్ని విడిచి వెళ్లొద్దు' - ఉపాధ్యాయురాలి రిటైర్మెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు