Confused About Having Second Child : ఒకప్పుడు ఇంటినిండా పిల్లలు ఉంటే సంబరంగా భావించేవారు. ఉమ్మడి కుటుంబంలోని ఇంటి సభ్యులందరూ చిన్న పిల్లలను ఆట పాటలతో ఆడిస్తుంటే పెద్దలు పనులు చేసుకునే వారు. కానీ, ఆ తర్వాత కాలానుగుణంగా వచ్చిన మార్పులతో జాయింట్ ఫ్యామిలీలు తగ్గిపోయి సింగిల్ కుటుంబాలుగా విడిపోయాయి. ఈ మార్పులతో చాలా మంది జంటలు ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకున్నారు. అనంతరం అది ఒక్కరికి పడిపోయింది. అయితే, కొంతమంది ప్రెగ్నెన్సీ సమయంలో ఏర్పడిన అనారోగ్య కారణాల వల్ల మొదటి సంతానం కలిగిన తర్వాత రెండో బిడ్డకు దూరంగా ఉంటారు. అనంతరం ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాత రెండో సంతానం కోసం సిద్ధపడతారు. ఇలాంటి పరిస్థితి ఓ మహిళకు ఎదురైంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.
'నా ఏజ్ 36. పెళ్లై 10 ఏళ్లు. నాకు ఒక పాప. ప్రెగ్నెన్సీలో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. ఫలితంగా డిప్రెషన్ బారిన పడ్డాను. దీంతో ఇక పిల్లలు వద్దనుకున్నాం. కానీ, పాపను చూసిన ప్రతిసారీ భవిష్యత్తులో ఒక్కతే అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకొకరిని కనమని పెద్దవాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నా. ఏం చేయాలి?' అని మానసికి నిపుణుల సహాయం కోరుతోంది. ఈ సమస్యకు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి చక్కటి వివరణ ఇస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
'మా వారు అప్పుడే కోపంగా, అంతలోనే ప్రశాంతంగా మారిపోతారు!'- ఆయన సమస్య పిల్లలకు వస్తుందా ?
సాధారణంగా చాలామంది మొదటి బిడ్డను కన్న రెండు లేదా మూడేళ్లకు రెండో బిడ్డనీ కనేస్తారు. మీరు ఆ సమయంలో వద్దనుకున్నారు కాబట్టి, ఇప్పటివరకూ మరో బిడ్డ గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం పాప ఒంటరిగా పెరగకూడదు అనుకుంటున్నారు. ఇలా ఆలోచించడంలో తప్పేమీ లేదు. తోబుట్టువులు ఉంటే పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అలాగే ఒకరికొకరు తోడుంటారు.
"మీరు గతంలో డిప్రెషన్ బారిన పడ్డారన్నారు. వయసు కూడా 30 దాటింది. ప్రస్తుతం మీరు మీ శారీరక, మానసిక ఆరోగ్యాల్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే, నిజంగా పాప ఒంటరిగా ఫీలవుతుందా? ఇప్పుడు రెండవ బిడ్డ అవసరమా? ఇతరుల ఒత్తిడితోనే ఈ నిర్ణయానికి వచ్చారా అన్నదీ ఆలోచించుకోండి." - డాక్టర్ మండాది గౌరీదేవి (మానసిక నిపుణురాలు)
రెండో సంతానం అవసరం అనిపిస్తే, భార్యాభర్తలిద్దరూ ఫిట్‌నెస్, జన్యు పరీక్షలు వంటివి తప్పక చేయించుకోవాలి. దాంతోపాటే పాపనీ మానసికంగా రెడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి, మీ ఆలోచనలతో టైమ్ వృథా చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని మండాది గౌరీదేవి సూచిస్తున్నారు.