Small Trader Murdered for Rs.2000 in Pulivendula: మానవత్వం మంటగలిసింది, డబ్బు దాడికి ఉసిగొల్పింది, పిడిగుద్దుల వర్షం కురిపించింది, ఇదంతా జరిగింది కేవలం 2 వేల రూపాయల కోసం. ఈ దాడితో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆదివారం పట్టపగలు జరిగిన ఉదంతం ఇది. రూ.2 వేలు ఇస్తాం పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వగలవా అని బాధితులు కన్నీటి పర్యంతం అవుతూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పులివెందుల పట్టణానికి చెందిన మోహన్ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తాడు. ఆదివారం అరటికాయల మండీ వ్యాపారి రామట్లపల్లె రామాంజనేయులు, ఓ హోంగార్డుతో పాటు అక్కడికి చేరుకుని మోహన్‌పై దాడి చేశాడు. వ్యాపారానికి అవసరమైన అరటి పండ్లు సరఫరా చేసిన రామాంజనేయులుకు మోహన్ రూ.2 వేలు బాకీ పడ్డాడు. ఆ డబ్బు ఇవ్వలేదని రామాంజనేయులు, హోంగార్డుతో కలిసి మోహన్‌పై దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించడమే కాకుండా తలపై కొట్టారు. దీంతో మోహన్ అక్కడికక్కడే పడిపోయారు.
స్థానికులు మోహన్‌ను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కేవలం రూ.2 వేల కోసం ఇలా దాడి చేసి చంపడం ఎంత వరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రామాంజనేయులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కూడా కావడంతో రాజకీయ పలుకుబడితో పోలీసులను వెంటేసుకుని వచ్చి మరీ దాడికి దిగడం గమనార్హం. ఈ మేరకు కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పులివెందుల అర్బన్ సీఐ నరసింహులు తెలిపారు.
కుమార్తె ప్రేమ వివాహం - సహకరించిన వ్యక్తి హత్యకు తండ్రి సుపారీ
'10 రోజులపాటు హింసించారు' - రూ.36 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి