Father Supari Plan For Daughter Love Marriage : తన కుమార్తె ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తి హత్యకు సుపారీ ఇచ్చాడో తండ్రి. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక వేశారు. హత్య చేసేందుకు రెక్కీ చేస్తుండగా చివరికి పోలీసులుకు చిక్కారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో జరిగింది. నందిగామ ఏసీపీ తిలక్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వ రాజు అనే వ్యక్తిని 14 నెలల క్రితం ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు కుమార్తె రమ్యశ్రీ ప్రేమించి వివాహం చేసుకుంది.
హత్య చేసేందుకు రెక్కి : ఈ ప్రేమ వివాహానికి కోలా నరసింహారావు సమీప బంధువు మువ్వ గోపి సహకరించాడు. ఇతను ఏ కొండూరు మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పని చేస్తున్నాడు. దీంతో తన కూతురి ప్రేమ వివాహానికి సొంత బంధువే సహకరించాడనే కారణంతో మువ్వ గోపిని హత్య చేసేందుకు రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు ప్రణాళిక వేశాడు. ఇందుకోసం హత్యకు హైదరాబాద్‌కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్‌కు లక్ష రూపాయలకు సుపారీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు అతడు మరో ముగ్గురితో కలిసి ఐతవరంలో ఉన్న మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు.
రంగంలోకి పోలీసులు : ఆ సమయంలో కుదరకపోవటంతో ఫిబ్రవరి 2 ఆదివారం నాడు మువ్వ గోపిని హత్య చేసేందుకు నందిగామ మయూరి టాకీస్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీనిపై నందిగామ సీఐకి సమాచారం అందడంతో ఆయన తన సిబ్బందితో కలిసి నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య కుట్ర బహిర్గతమైంది. వారి వద్ద నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు నందిగామ ఏసీపీ తిలక్ వెల్లడించారు.
"రాజు అనే వ్యక్తి ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు పెద్ద కుమార్తె రమ్యశ్రీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి రమ్యశ్రీ దగ్గరి బంధువు మువ్వ గోపి సహకరించాడు. సొంత బంధువే సహకరించడంతో కక్ష పెంచుకున్న రమ్యశ్రీ తండ్రి గోపిని హత్య చేసేందుకు ప్రణాళిక వేశాడు. దీంతో హైదరాబాద్‌కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్‌కు లక్ష రూపాయలకు సుపారీ ఇచ్చారు. అతను మరో ముగ్గురితో కలిసి గోపిని హత్యచేసేందుకు రెక్కీ నిర్వహిస్తుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నాం. అనంతరం హత్య కట్ర బయటపడింది." - తిలక్, నందిగామ ఏసీపీ
Son kidnapped Parents: ఆస్తి కోసం కుమారుడి స్కెచ్.. సుపారీ గ్యాంగ్‌కు డబ్బులిచ్చి మరీ..
కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా బయటపడ్డ యోగా టీచర్- చనిపోయినట్లు నటించి!