YCP Govt Skips Regularization of Contract Employees:క్రమబద్ధీకరణ పేరిట ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులని జగన్ నిలువునా మోసం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి విరుద్ధంగా వివిధ నిబంధనల సాకును చూపి రెగ్యులరైజ్‌కు ఉత్తర్వులు ఇచ్చి నయవంచనకు పాల్పడ్డారు. అది కూడా ఎన్నికల కోడ్ వచ్చే వరకూ ఆగి అత్యంత స్వల్పంగా క్రమబద్ధీకరించారు. పైగా పీఆర్‌సీతో రావాల్సిన వేతనాలను సైతం ఇవ్వని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులంటూ సంక్షేమ పథకాలకు సైతం వారిని దూరం చేశారు.
ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్ ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి రకరకాల నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. వడపోతలపై వడపోతలు చేసి సాగదీశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చేంత వరకు ఇదే ధోరణిని ప్రదర్శించి ఇక రెగ్యులరైజ్ చేయలేమంటూ చేతులెత్తేశారు.
నిబంధనలతో క్రమబద్ధీకరణకు ఎసరు: ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇష్టం లేని జగన్ రెగ్యులరైజ్ సంఖ్యను తగ్గించడానికి మొదట 2014 జూన్ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారే అర్హులనే నిబంధన విధించారు. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో కొంతకాలం గడిపి జగన్ సర్కర్ మాట మార్చింది. 2014 జూన్ నాటికి పనిచేస్తూ ఉన్నవారే అర్హులు అనే నిబంధన తీసుకొచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారినే క్రమబద్ధీకరిస్తామని మరొక నిబంధన పెట్టారు. దీంతో విద్య, వైద్య, ఆరోగ్య, అటవీ, సాంకేతిక విద్యా శాఖ తదితరాల్లో మినహా సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు అనర్హులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు పని చేస్తుండగా జగన్ సర్కారు విధించిన నిబంధనలతో కేవలం 10,117 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించారు. వారిలో 3,350 మంది ఉద్యోగాలను మాత్రమే రెగ్యులరైజ్ చేశారు.
ఒప్పంద ఉద్యోగుల సంఖ్య తగ్గింపు: ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సంబంధించి మ్యానిఫెస్టోలో ఎలాంటి నిబంధనలు పేర్కొనని జగన్ క్రమబద్ధీకరణకు వచ్చేసరికి మాత్రం సవాలక్ష షరతులు పెట్టారు. ఒప్పంద ఉద్యోగి పనిచేస్తున్న పోస్టు ప్రభుత్వం మంజూరు చేసినదై ఉండాలని, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి క్రమబద్ధీకరించే సమయానికి మంజూరు పోస్టులోనే పనిచేస్తూ ఉండాలని షరతు పెట్టారు. ఉద్యోగ నియామకానికి ప్రకటన జారీ కావాలని, ఆ పోస్టుకు రిజర్వేషన్ రోస్టర్ అమలవ్వాలనీ నిబంధన విధించారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలని షరతు పెట్టారు. ఉద్యోగులకు వ్యతిరేక నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. విద్యాశాఖలో సబ్జెక్టుకు సంబంధించి క్లియర్ వెకెన్సీ ఉండాలన్న నిబంధనతోనూ చాలా మంది అర్హత కోల్పోయారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నా సబ్జెక్టుల విషయంలో తేడా ఉంది. ఉదాహరణకు ఓ డిగ్రీ కళాశాలకు భౌతికశాస్త్రం పోస్టు మంజూరు అయి ఉంది. ఆ కళాశాలలో గణిత అధ్యాపకుడు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. మంజూరైన పోస్టులో కాకుండా ఖాళీగా ఉన్న పోస్టులో ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న వారిని క్రమబద్ధీకరించడం కుదరదని పేర్కొంది. అన్ని విభాగాల్లోని ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చే వరకు కపటనాటకం ఆడిన వైఎస్సార్సీపీ సర్కారు కోడ్ వచ్చిన తర్వాత కుదరదు అంటూ మోసం చేసింది. ఇప్పుడు మరోసారి క్రమబద్ధీకరణ గురించి అబద్ధాలు చెబుతూ ఒప్పంద ఉద్యోగులను మభ్యపెట్టేందుకు జగన్ సిద్ధం అయ్యారు.
ఇంటర్మీడియట్ విద్యలో గత కొన్నేళ్లుగా 3,593 మంది ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులుగా కొనసాగుతున్నారు. వారిలో ఒక్కరినీ రెగ్యులరైజ్ చేయలేదు వైఎస్సార్సీపీ సర్కారు. అందుకు ఏవేవో కారణాలు చూపింది. రాష్ట్రంలోని 82 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అసలు లెక్చరర్ పోస్టులే మంజూరు కాలేదు. వాటిలో కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం వారందర్నీ క్రమబద్ధీకరించాలనుకుంటే పోస్టులు మంజూరు చేయొచ్చు. కానీ, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 2021లో ఏపీపీఎస్సీ ద్వారా 180 మంది అధ్యాపకులు నియమితులయ్యారు. వీరి కోసం అప్పటికే మంజూరైన పోస్టుల్లో 175 మంది పనిచేస్తున్నారు. వీరిని ఒప్పంద ఉద్యోగులను నాన్ శాంక్షన్డ్ పోస్టులోకి మార్చారు. ఇది ప్రభుత్వం తప్పైనా దానికి ఒప్పంద ఉద్యోగులనే బాధ్యులుగా చేసింది.శాంక్షన్డ్ పోస్టులు లేని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 475 మంది అధ్యాపకులకు జీతాల సమస్య రావడంతో 2020లో వారిని మంజూరు పోస్టుల్లోకి మార్చింది. తెలుగు, సివిక్స్ సబ్జెక్టులకు మంజూరు పోస్టులు లేవని 51 మందిని నాన్ శాంక్షన్డ్ పోస్టుల్లోనే ఉంచేశారు. వీరిని అనర్హులుగా తేల్చేశారు. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ఈ తప్పిదానికి అమాయకులైన లెక్చరర్లను బలి చేసింది.డిగ్రీ కళాశాలల్లో 650 అర్హులైన వారు ఉండగా వారిలో ఒక్కరి ఉద్యోగాన్ని కూడా క్రమబద్ధీకరించక పోయింది.
"పీఆర్సీ వచ్చిన తరువాత రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్‌ను వేతనంగా 2లక్షల 45 వేల మందికి జీతాలు చెల్లించాలి. కాని దీనికి విరుద్ధంగా బేసిక్ కన్నా తక్కువ వేతనాలను నిర్ణయింస్తూ జీవో 7ను జగన్ సర్కార్ జారీ చేసింది"-ఏవీ నాగేశ్వరరావు, ఐకాస నేత
ఎన్నికల కోడ్ వచ్చే ముందు జీవో: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తుండగా ఇద్దరి ఉద్యోగాలను మాత్రమే క్రమబద్ధీకరించారు. మిగిలినవారికి మొండిచేయి చూపారు. వర్క్‌షాపుల్లో 140 మంది అటెండర్లు పనిచేస్తుంటే 22 మందినే రెగ్యులరైజ్ చేశారు. వీరిలో కొందరికి ఎన్నికల కోడ్ వచ్చిన రోజు ఉదయమే జీఓ ఇచ్చారు. కమిషనర్ నియామక ఉత్తర్వులు ఇచ్చేలోపు ఎన్నికల కోడ్ రావడంతో నియామకాలు నిలిచిపోయాయి.వైద్య ఆరోగ్య శాఖలో 2014 జూన్ 2కు ముందు విధుల్లో చేరిన సుమారు వెయ్యి మంది ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వం కోర్టు కేసులను సాకుగా చూపి పక్కన పెట్టింది. ఈ శాఖలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న 3,821 మందికి క్రమబద్ధీకరణ అర్హత ఉందని గుర్తించారు. వీరిలో మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్లు వెయ్యి మంది వరకు ఉన్నారు. 2002 నోటిఫికేషన్ ప్రకారం 2003లో వీరు పోస్టింగులు పొందారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అవ్వాయి. దీంతో కొందరిని విధుల నుంచి తప్పించారు. తుది తీర్పు వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. కానీ, ప్రభుత్వం వీరి ఉద్యోగాలను ఇంతవరకు క్రమబద్ధీకరించలేదు.
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా- కేసులు, భారీ జరిమానాలపై ముఠా కార్మికుల ఆవేదన