Yasangi Crop Loss in Telangana : అకాల వర్షాలు అన్నదాతల ఆరుగాల కష్టాన్ని ఆగం ఆగం చేస్తున్నాయి. పొట్ట దశలో ఉన్న పైరు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీటి పాలవుతుండటాన్ని చూసి రైతన్న గుండె చెరువవుతోంది. రాలిపోతున్న మామిడి కాయలు, నాశనమవుతున్న కూరగాయలతో ఆశలు అడియాశలవుతున్నాయి. ఊహించని విధంగా ఈదురుగాలులతో విరుచుకుపడుతున్న వర్షాలతో రాష్ట్రంలో వారం రోజులుగా కర్షకులు కకావికలమవుతున్నారు.
Crop Damage in Telangana 2024 : యాసంగి సీజన్‌లో పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో రైతులు కష్టాలు పడ్డారు. కానీ ప్రస్తుతం కోతల సమయంలో అకాల వర్షాలు వారికి శరాఘాతంగా మారాయి. మధ్యలో మార్చిలోనూ వడగళ్ల వానలతో నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత మండు వేసవిలో భారీ వర్షాలు, ఈదురుగాలులు అన్నదాతల వెన్నువిరుస్తున్నాయి.
కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి : సాధారణంగా నవంబర్ నుంచి మే వరకు యాసంగి కొనసాగుతుంది. ఈ సమయంలో వర్షాలు ఉండవనే నమ్మకంతో వరితో పాటు అపరాలు, వాణిజ్య పంటల సాగుకు అన్నదాతలు ప్రాధాన్యమిస్తారు. 90 నుంచి 110 రోజుల్లో దిగుబడులు వస్తాయి. అయితే వాతావరణ మార్పులు రైతుల ఆశలకు గండి కొడుతున్నాయి. అకాల వర్షాలు, వడగళ్లతో ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మామిడికాయలు రాలిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఈ నష్టాలు ఆనవాయితీగా మారాయి.
పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ నిధుల నుంచి సాయం అందించాలి. అకాల వర్షాల విషయంలో మాత్రం సరిగా అందడం లేదు. వ్యవసాయశాఖ నిబంధనలు కూడా అసంబద్ధంగా ఉంటున్నాయని కర్షకులు ఆరోపిస్తున్నారు. ఒక రైతుకు సంబంధించి మూడో వంతు కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే సాయం పొందేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆలోపు నష్టపోయిన వారికి ఎలాంటి సాయం అందడం లేదు.
తెలంగాణలో ప్రస్తుతం పంటల బీమా పథకాలేవీ అమల్లో లేవు. ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందాల్సి ఉన్నా రావడం లేదు. గత ఐదేళ్లుగా భారీ నష్టాలపై తెలంగాణ సర్కార్ కేంద్రానికి నివేదిక పంపుతున్నా సాయం మాత్రం రాలేదు. గతేడాది మార్చి నెలలో జరిగిన నష్టానికిగాను రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఎకరానికి రూ.10,000ల చొప్పున చెల్లిస్తామని ప్రకటించి అందించింది. ఆ తర్వాత అదే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మరో రెండుసార్లు వర్షాలు పడగా ప్రభుత్వం సాయం ప్రకటించింది. జీవో కూడా ఇచ్చినప్పటికీ సాయం అందలేదు. ఈ ఏడాది మార్చి 16-22 తేదీల మధ్య కురిసిన అకాల వర్షానికి సంబంధించి జరిగిన నష్టానికి గాను సర్కార్ ఇటీవల 15.81 కోట్లు విడుదల చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం.
నెల ముందుగానే : ఏటా సంభవిస్తున్న అకాల వానలతో పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం కలుగుతుండటంపై ప్రభుత్వ స్థాయిలో విస్తృత చర్చలు జరిగాయి. యాసంగి సీజన్‌ను నెల రోజులు ముందుకు జరపాలనే ప్రతిపాదనను పరిశీలించింది. అక్టోబర్‌లో ప్రారంభించి ఫిబ్రవరి లేదా మార్చిలో ముగించాలని యోచించింది. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఈ విధానం నడుస్తోంది. అదే తరహాలో తెలంగాణ అంతటా అమలు చేయాలని భావించినా గత సంవత్సరం వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రతిపాదన అమలు కాలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చే సీజన్ నుంచి రైతుబీమా అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి విధివిధానాలు కూడా సిద్ధం చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే అన్నదాతలకు కొంత ఊరట కలిగే వీలుంది.
కష్టమంతా వర్షార్పణం : వీరిద్దరూ హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింపన్న రమేష్ దంపతులు. స్థానికంగా రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. కొంతైనా కాపాడుకుందామనే తాపత్రయంతో ఇలా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.
2015 నుంచి యాసంగి సీజన్ అకాల వర్షాలతో పంట నష్టాలు ఇలా :
సంవత్సరం | ఎకరాలు | రైతులు |
2015 | 12,024 | 3823 |
2016 | 19,241 | 9314 |
2017 | 8232 | 2941 |
2018 | 21,303 | 7824 |
2019 | 23,219 | 8926 |
2020 | 29,392 | 11,032 |
2021 | 32,417 | 12,945 |
2022 | 1,92,984 | 22,943 |
2023 | 2,28,450 | 95,024 |
2024 | 15,814 | 15,246 (మార్చి వరకు) |