Yanamala Letter to CM Chandrababu : ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే తన పరిశీలనలు, సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు వైఎస్సార్సీపీ నాయకులు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టం అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని ఆయన సూచించారు.
జగన్ సర్కార్ గత ఐదేళ్లలో చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన, సానుకూల పురోగతి చర్యలు అభినందనీయమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా తన అనుభవంతో 15 అంశాలను సూచిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తోడ్పాటుతో పాటు, రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని యనమల లేఖలో అభిప్రాయపడ్డారు.
Yanamala on AP Economic Situation : పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, కేంద్రం నుంచి అధిక డెవల్యూషన్ (41 లేదా 42శాతం) వాటాను కోరుతోందని యనమల అన్నారు. సహేతుకమైన స్థిరమైన రుణాలు, ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని తెలిపారు. ఈరోజు నాటికి ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర రుణాల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాలని సిఫార్సు చేశారు. అలాగే వెయిన్స్ అండ్ మీన్స్, ఓడిని జాగ్రత్తగా ఉపయోగించాలని లేఖలో పేర్కొన్నారు.
అలాగే ఆదాయ వ్యయాల తగ్గించుకోవాలని, సంక్షేమ పథకాలను అర్హులైన వారికే లక్ష్యంగా పెట్టుకోవాలని యనమల లేఖలో తెలిపారు. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలని, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని సూచించారు. సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు మింగేసిన డబ్బు, రెవెన్యూ రికవరీ చట్టం అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని లేఖలో ప్రతిపాదించారు.
ప్రబలంగా ఉన్న అవినీతిని నిర్మూలించాలి : ఎఫ్ఆర్బీఎం చట్టంలో ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని యనమల వివరించారు. తద్వారా లోటులను ప్రస్తుతం నియంత్రించి, రాబోయే సంవత్సరాల్లో తగ్గించాలని చెప్పారు. అదేవిధంగా బిల్లుల చెల్లింపులు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా మాత్రమే చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పురోగతి, శ్రేయస్సు కోసం అనుకూలమైన వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు, ప్రబలంగా ఉన్న అవినీతిని నిర్మూలించాలని పేర్కొన్నారు. చంద్రబాబు దార్శనిక నాయకత్వం, సుపరిపాలన పట్ల నిబద్ధతతో రాష్ట్రం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని యనమల రామకృష్ణుడు ఆకాంక్షించారు.
ఏపీ ఆర్థిక గణాంకాలపై కాగ్ నివేదిక - ఏడాదిలో 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్