Yadadri Laddu Quality Test : తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి క్షేత్ర సందర్శన కోసం వచ్చే భక్తులు లడ్డూ, పులిహోర ప్రసాదాల కొనుగోలుకు అత్యంత ఆసక్తి వహిస్తారు. వారి నమ్మకం, విశ్వాసాలకు తగ్గట్లే ప్రసాదం నాణ్యతలో ఎలాంటి లోపం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు పేర్కొన్నారు. లడ్డూ తయారికీ ఉపయోగించే పదార్థాలను ప్రభుత్వ సంబంధిత శాఖల ధృవీకరణతోనే ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మదర్ డెయిరీ నెయ్యితో లడ్డూ తయారీ : స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు విక్రయించే వంద గ్రాముల లడ్డూలను ప్రతిరోజూ 25 వేల నుంచి 28 వేల వరకు తయారీ చేస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఇంకా అవసరమైతే అప్పటికప్పుడు సిద్ధం చేస్తామని, అందుకు అవసరమైన మానవవనరులు, యంత్రాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని ప్రముఖ కంపెనీ మదర్ డెయిరీ ద్వారా కేజీ రూ.609కి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరానికి తగ్గట్లు కంపెనీ నుంచి నెయ్యి తెప్పించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో పరీక్షలు : నెయ్యి నాణ్యతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని డైరీ నిర్వాహకులు పంపిస్తారని ఈవో పేర్కొన్నారు. తాము కూడా నెయ్యి నాణ్యతను తెలుసుకునేందుకు హైదరాబాద్ నాచారంలోని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఆలయ లడ్డూ రుచి, నాణ్యత తగ్గకుండా, ఐదు రోజుల నుంచి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. చిరుధాన్యాలతో తయారీ చేసే లడ్డూ ప్రసాదాలను సైతం విక్రయిస్తున్నట్లు వెల్లడించాయి.
యాదాద్రి ప్రసాదాలకు భోగ్ సర్టిఫికెట్ గుర్తింపు వచ్చినట్లు ఈవో భాస్కర్‌రావు పేర్కొన్నారు. ఈ క్షేత్రంలో విక్రయించే ప్రసాదాలు పూర్తి నాణ్యతా ప్రమాణాలు కలిగినవని చెప్పడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిందని తెలిపారు. ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జాతీయ సర్టిఫికెట్ భోగ్ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్) గుర్తింపు సైతం ఉందని వెల్లడించారు.
"యాదాద్రి ప్రసాదం నాణ్యతలో ఎటువంటి రాజీపడకుండా శుద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తున్నాె. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని ప్రముఖ కంపెనీ మదర్ డెయిరీ ద్వారా కేజీ రూ.609కి కొనుగోలు చేస్తున్నాం. సరఫరా చేసిన నెయ్యి నాణ్యతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని డైరీ నిర్వాహకులు పంపిస్తారు. వచ్చిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకు నాచారంలోని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తాము". - భాస్కర్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో