AI Global Summit End : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఏఐ సిటీలోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తొలి అడుగు వేసింది. ఏకంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాల కార్యాలయం నిర్మిస్తామని ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ డబ్ల్యూటీసీఏ(WTCA) ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్ఐసీసీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో రాష్ట్రప్రభుత్వంతో డబ్ల్యూటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలను రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, డబ్ల్యూటీసీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబిన్ వాన్ పుయెన్‌బ్రోక్, డబ్ల్యూటీసీ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డిలు మార్చుకున్నారు. కార్యక్రమంలో డబ్ల్యూటీసీ వైస్ ప్రెసిడెంట్ భార్గవ శ్రీవారి, డబ్ల్యూటీసీ డైరెక్టర్ వంశీకృష్ణ, ఐటీ మంత్రి సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీలో డబ్ల్యూటీసీఏ ఆధ్వర్యంలో మిలియన్ స్వేర్ ఫీట్లతో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఏఐ మార్కెట్‌ను తెలంగాణ వైపు మళ్లించడంలో తొలి అడుగు పడిందని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఏఐ సిటీలో డబ్ల్యూటీసీ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించేందకు వందల కంపెనీలు ముందుకొస్తాయని వివరించారు. తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులని నియమించుకుంటాయని తెలిపారు.
డబ్ల్యూటీసీఏ రాకతో తెలంగాణలో అదనంగా సుమారు 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ ఎల్ఎల్పీ తదితర డేటా కంపెనీలున్న దిగ్గజ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలో ఆ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని వెల్లడించారు. అంతిమంగా తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.
కొత్త డబ్ల్యూటీసీ లైసెన్స్ రావడం సుధీర్ఘ ప్రక్రియ : సాధారణంగా కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోసం లైసెన్స్ పొందడం అనేది సుధీర్ఘ ప్రక్రియ. కానీ తెలంగాణలో వారంలోనే అనుమతులు రావడం ఒక రికార్డు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహించడం ద్వారా ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు ప్రయాణానికి నాయకత్వం వహించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. అందుకే ఇక్కడ డబ్ల్యూటీసీఏ ఏర్పాటుకు ముందుకు వచ్చాం.' అని ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబిన్ వాన్ పుయెన్‌బ్రోక్ తెలిపారు.
ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం: సీఎం - CM Revanth Reddy On AI