Women Agarbatti Business : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌లోని నలుగురు మహిళలు సమీప గ్రామాల్లోని వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. "అయోధ్య రాముని పూలతో అగర్‌బత్తీల తయారీ కేంద్రం" పేరుతో కుటీర పరిశ్రమ నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. సెహగల్ ఫౌండేషన్ వీరికి అగర్‌బత్తీలు తయారీలో శిక్షణ ఇవ్వడంతోపాటు కావాల్సిన యంత్రాలను అందించింది. ఫౌండేషన్ ద్వారానే అగర్‌బత్తీలను తయారు చేసే విధానంలో శిక్షణ ఇస్తోంది. వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలను సేకరించి అగర్‌బత్తీలు తయారు చేస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు.
అగర్‌బత్తీల తయారీకీ కావాల్సిన ముడి పదార్థాలను హైదరాబాద్‌లోని ఛార్మినార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తక్కువ ధరతో నాణ్యత కలిగిన బత్తీలు ఇవ్వడంతో తమ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకునే విధంగా యోచిస్తున్నారు. ప్రస్తుతం మార్కట్‌లో ఉన్న బత్తీలకు భిన్నంగా ఇక్కడ అగర్‌బత్తీలను తయారు చేస్తున్నారు. ఈ తయారీ మెుత్తం తమ ఇళ్లల్లోనే చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటికి భిన్నంగా రసాయనాలు లేని సహజసిద్ధమైన పదార్థాలతోనే ఊదుబత్తిలను తయారు చేస్తున్నారు. వీటి నుంచి వెలువడే పొగను పీల్చితే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని మహిళలు చెబుతున్నారు.
"మా ఊళ్లో సెహగల్ ఫౌండేషన్ వాళ్లు కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగానే వారు మహిళల ఉపాధి గురించి కొన్ని విషయాలు చెప్పారు. మహిళలు ఏదైనా వ్యాపారం లాంటిది చేయాలి అనుకుంటే మేము సహాయం చేస్తాం అని అన్నారు. అప్పుడే రెండు మూడు వ్యాపారల గురించి చెప్పారు. పాల వ్యాపారం, పసుపు, కారం ప్యాకింగ్, ఇంకొటి అగర్బత్తి బిజినెస్ గురించి చెప్తే , మేము ఇది చేయాలని నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించి వారే మాకు శిక్షణ ఇచ్చి, పరికరాలు కొనిచ్చారు. మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకుంటే మంచిందని మా ఆలోచన." - మహిళలు, అగర్బత్తి తయారీదారులు
రోజు కూలీ దొరుకుతుందో లేదోనని ఆందోళన లేకుండా తమకు నచ్చినప్పుడు పని చేసుకోవడం ఆనందాన్నిస్తుందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైన వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేసుందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇతర మహిళలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంటిపట్టునే ఉండి వ్యాపారం చేయడంతో ఇంటితో పాటు వారి భవిష్యత్తులో ముందడుగు వేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. పురుషులతో సమానంగా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.