Woman Pretending to be Pregnant in Jangaon District : పెళ్లై రెండు సంవత్సరాలు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో ఏం చేయాలో తోచని ఆ వివాహిత తాను గర్భం దాల్చినట్లు భర్త, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. తర్వాత నొప్పులు వస్తున్నాయంటూ ఆసుపత్రికి వెళ్లి అక్కడే గర్భస్రావమైనట్లు అబద్ధమాడింది. అనుమానం వచ్చిన డాక్టర్లు పరీక్షించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
9 నెలలుగా ఇంట్లో వారిని నమ్మిస్తూ : ఈ ఘటనపై వైద్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితకు పిల్లలు లేరు. పెళ్లై రెండు సంవత్సరాలు అవుతున్నా, ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో ఆవేదనకు గురైన మహిళ, తాను గర్భం దాల్చినట్లు ఇంట్లో వారితో చెప్పింది. కొన్ని నెలలు ఇంట్లో వారిని అలానే నమ్మించింది. అలా 9 నెలల నాటకమాడింది.
బాత్రూమ్లో పిండం పడిపోయిందని : ఈ నెల 9, 10 తేదీల్లో జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చి ఓపీలో రిజిస్టర్ చేయించుకుంది. బుధవారం మళ్లీ హాస్పిటల్కు వచ్చి పురిటి నొప్పులు వస్తున్నాయని ఓపీలో నమోదు చేయించుకుంది. నిజమేననుకున్న వైద్యులు మహిళకు సాధారణ కాన్పు చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఆమె బాత్రూమ్కు వెళ్లి అందులో గట్టిగా అరిచి, తనకు రక్తస్రావమైందని, పిండం పడిపోయిందని చెప్పింది.
పరీక్షలు నిర్వహించగా తెలిసిన నిజం : వెంటనే అప్రమత్తమైన వైద్యులు బాత్రూమ్లోకి వెళ్లి పరిశీలించగా, ఎలాంటి రక్తస్రావం అయినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా, అసలు ఆ మహిళ గర్భం దాల్చలేదన్న విషయం తేలింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, భర్తతో పాటు పలువురు బంధువులు ఆమెను నిలదీశారు. పిల్లలు పుట్టకపోయేసరికి టవల్స్ చుట్టుకుని గర్భం దాల్చినట్లు అందరినీ నమ్మించానని ఆమె తెలిపింది. దీంతో ఆ మహిళకు పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ దామోదర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.