Woman Loses ₹4 Lakhs in Cyber Fraud In Nunna Krishna District : కష్టాల్లో ఉన్నాను కాస్త డబ్బు సాయం చెయ్యారా అని మిత్రుడు అడిగినా ఆలోచిస్తాం, ఇస్తానన్న సమయానికి ఇస్తాడో లేదో అని సంకోచిస్తాం. ఏదైనా వస్తువు కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు మరికొందరు. అలాంటిది ముక్కూ మొహం తెలియని ఓ మెసెజ్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయి. రూ. 1000 పెట్టుబడి పెడితే గంటలో మీ ఖాతాలో అక్షరాలా లక్ష రూపాయలు జమవుతాయి. అని వస్తే గుడ్డిగా నమ్ముతారు కొందరు. కష్టపడి సంపాదించుకున్న డబ్బునంతా తెలిసీ తెలియక సైబరాసురుల జేబుల్లో పోస్తారు. నిజం తెలిశాక ఏ చెయ్యాలో తోచక సతమతమవుతారు.
Cyber Crime in Krishna District : ‘మేము చూపించే ఉత్పత్తులకు 5 స్టార్ రేటింగ్ ఇస్తే డబ్బులే డబ్బులు. మీరు చేయాల్సిందల్లా మా లింక్ క్లిక్ చేసి మా సంస్థలో చేరడమే. ఎన్ని సార్లు రేటింగ్ ఇస్తే అన్ని డబ్బులు వస్తాయి. డబ్బులు కట్టి పెయిడ్ రేటింగ్‌లు ఇస్తే మరింత ఎక్కువ ఆదాయం వస్తుంది.’ అని కాల్ వచ్చిన ఓ వివాహితకు. ఆమె వెంటనే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంది. వరుస టాస్క్‌లతో రూ.వేలు సంపాదించుకుంది. కంటికి ఎదురుగా యాప్‌లోని తన ఖాతాలో డబ్బులు కనిపిస్తున్నా విత్‌డ్రా చేసుకోలేని పరిస్థితి. సైబర్ నేరగాళ్ల తియ్యని మాటలకు మోసపోయి రూ.4.81 లక్షలు పొగొట్టుకున్న వివాహిత సైబర్ క్రైం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నున్నకు చెందిన వివాహిత (38) ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ నెల 17న నిమిష అనే గుర్తు తెలియని టెలిగ్రామ్ యూజర్ నుంచి పార్ట్‌టైం జాబ్ పేరిట ఆమెకు ఆఫర్ వచ్చింది. ఆమె ఆ మాటలు నమ్మి రిజిస్టర్ చేసుకోగానే 21వ తేదీన రూ.881 కమీషన్ వచ్చింది. తరువాత రోజు రూ.10 వేలు చెల్లించి రేటింగ్ టాస్క్ చేయగానే రూ.18,098 వచ్చాయి. అలా వస్తున్న ఆదాయం యాప్‌లోని ఆమె ఖాతాలో కనిపిస్తున్నాయి. అలా వారి మాటలు నమ్మి మొత్తం రూ.4,81,365 (నాలుగు లక్షల ఎనభైయ్యొక్కవేల మూడువందల అరవై అయిదు) ఆమె పెట్టుబడి పెట్టారు.
పైగా ఆమె ఖాతాలో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినా కుదరడం లేదు. దాంతో అనుమానం వచ్చిన ఆ మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహిత డబ్బులు ఆరు బ్యాంకు ఖాతాలకు, 5 యూపీఐ ఖాతాలకు వెళ్లాయి. ఒక ఖాతా అసోంలో, రెండు పశ్చిమ బెంగాల్, మరొకటి కేరళ, మిగిలిన రెండు ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు వెళ్లాయి. వాటి వివరాలను సైబర్ క్రైం పోలీసులు సేకరిస్తున్నారు.