Woman Got 4 Govt Jobs in Jagtial : ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ యువతి కల. అందుకోసం నాన్న చూపిన దారినే ఎంచుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ప్రైవేటుగా ఉద్యోగం చేసింది. చేస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అందులో జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది ఈ యువతి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చెందిన ఈ యువతి పేరు సాయిశిల్పి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకటేశ్వర శర్మ, సురేఖల ఏకైక కుమార్తె. చిన్నప్పటి నుంచి చదువులో ముందంజలో ఉండేది.
ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది సాయిశిల్పి. తండ్రి కల కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. సివిల్స్ సాధించాలని ఉన్నా కుటుంబం కోసం టీచర్ వృత్తిని ఎంచుకుంది. పిల్లలకు పాఠాలు చెబుతునే పోటీ పరీక్షల కోసం సన్నద్ధమైంది. కేంద్ర రాష్ట్రాల నుంచి ఏ పోటీ పరీక్ష నోటిఫికేషన్ వచ్చిన దరఖాస్తు చేసుకుంటూ సాధన చేసింది. అలా 2018లో అప్పటి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఎస్జీటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అదే సంవత్సరం ఆర్మీ పబ్లిక్ స్కూల్ పరీక్షలో ప్రైమరీ టీచర్ ఉద్యోగం వచ్చిందని చెబుతోంది.
భవిష్యత్తులో సివిల్స్ సాధిస్తా : రాసిన పరీక్షలన్నింటిలోనూ ర్యాంకులు రావడం తనను ఎంతో ఉత్సాహం కలిగించిందని చెబుతోంది సాయిశిల్పి. గురుకులం ఉపాధ్యాయ పరీక్షలో రెండో ర్యాంకు, జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మొదటి ర్యాంకును సాధించింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని, తన కుమార్తై నెరవేర్చడం చాలా ఆనందంగా ఉందంటున్నారు సాయిశిల్పి తండ్రి వెంకటేశ్వర శర్మ. ఈ ఉద్యోగం సాధించడం ఆర్థికంగా మేము కొంచెం నిలదోక్కుకుంటున్నామని చెబుతున్నారు.
కోచింగ్ లేకుండా ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే మాటలు కాదు. అయితే కుటుంబ పరిస్థితులు, సాధించాలనే పట్టుదలనే తన విజయానికి కారణమంటోది సాయిశిల్పి. భవిష్యత్తులో సివిల్స్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే అమ్మానాన్న ఆశయాల లక్ష్యసాధనకు అనుగుణంగా విద్యారంగంలో తన వంతు సహాయం చేయాలనే లక్ష్యం ఉందంటోందీ విజేత.
'నేను ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. వర్క్ చేస్తునే అధికారుల నుంచి అనుమతి తీసుకుని వేరే పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నా. రీసెంట్గా గురుకులం ఉపాధ్యాయ పరీక్షలో రెండో ర్యాంకు వచ్చింది. ఇప్పుడు జేఎల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇదంతా ర్యాంకుల కోసం కాదు కొత్తగా మరో ఉద్యోగం సాధించాలనేదే నేను ఆలోచించా'- సాయిశిల్పి, జేఎల్ ర్యాంకర్