Woman Fight With Tiger For Her Husband in Telangana : జనావాసాల్లో పులులు సంచరించడం కలకలం రేపుతోంది. వన్యప్రాణులు జనజీవనంలోకి రావడంతో భయంతో వణికిపోతున్నారు. తాజాగా తెలంగాణలో పత్తి ఏరుతున్న యువతిపై పులి దాడి చేసి హతమార్చగా ఏపీలోనూ పులి, చిరుతలు జనావాసాల్లో కనిపించి ఆందోళన రెకెత్తిస్తున్నాయి. మూగజీవాలపై చిరుతల దాడులు సర్వసాధారణం కాగా అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు భయం గుప్పిట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఓ మహిళ పులిపై తిరగబడింది. పులిని పరుగులు పెట్టించి తన భర్త ప్రాణాలు నిలబెట్టుకుంది. ఈ ఘటన తెలంగాణలోని అసిఫాబాద్ జిల్లాలో జరిగింది.
సిర్పూర్(టి) మండలం దుబ్బగూడలో సురేశ్, సుజాత దంపతులు నివసిస్తున్నారు. వ్యవసాయమే వీరి జీవనాధారం. కొన్ని రోజులుగా అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని సురేశ్ రాత్రుళ్లు అక్కడే కాపలాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు ఎన్నడూ పులి గానీ, ఇతర జంతువులని గానీ చూడలేదు.
"పత్తిచేనులో పెద్దపులి" - తాళ్లు తెంపుకుని ఊళ్లోకి పరిగెత్తిన ఎద్దులు
సుజాత కూడా రోజూ ఉదయం చేనుకి వెళ్లేది. అదే విధంగా శనివారం కూడా వెళ్లి పత్తి ఏరుతండగా కొంత సేపటికి భర్త ఎడ్లబండి తోలుకుంటూ అక్కడికి వెళ్లాడు. అప్పటికే పక్కనే పొదల్లో మాటువేసిన పులి ఒక్కసారిగా సురేశ్పైకి దూకింది. సరాసరి మెడపై పంజా విసరడంతో అతను గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. అలజడితో కొంత దూరంలో సుజాత అటుగా చూసింది. భీకరంగా ఉన్న పులి, భర్త మెడను కరుచుకుని ఉండటం చూసి బిత్తరపోయింది. రక్తమోడుతున్న భర్తను చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పులిపై ఎదురు దాడి ప్రారంభించింది. చేతికందిన రాళ్లు, కర్రలు తీసుకుని పులి మీదకు విసిరి పెద్దగా కేకలు వేసింది. దీంతో భయపడిన పులి సురేశ్‌ను వదిలేసి పరుగులు తీసింది. వెంటనే చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడికి వచ్చి గాయపడిన సుజాత భర్తను ఆసుపత్రికి తరలించారు.